కేసీఆర్ జ‌న్మ‌దినం అంటూ ఓ ఆర్భాటపు కార్యక్రమం చేపట్టారు: విజ‌య‌శాంతి

18-02-2021 Thu 10:30
  • కోటి వృక్షార్చన అంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చేప‌ట్టారు
  • మొక్కలు నాటాలని గ్రామాధికారులకు ఆదేశాలిచ్చారు
  • గతంలో నాటిన మొక్కల బిల్లులే రాలేదు
  • సమయానికి జీతాలందక ఆర్టీసీ, జీహెచ్ఎంసీ ఉద్యోగుల వేదన
  • సర్కారు వారు నిర్లక్ష్యం వీడరు
vijaya shanti slams trs

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ నేత‌ల‌పై బీజేపీ నాయ‌కురాలు విజ‌య‌శాంతి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. నిన్న ఆయ‌న పుట్టినరోజు సంద‌ర్భంగా టీఆర్ఎస్ నేత‌లు చేసిన ఆర్భాటం స‌రికాద‌ని ఆమె చెప్పారు.

'తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా కోటి వృక్షార్చన అంటూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట ఒక ఆర్భాటపు కార్యక్రమం చేపట్టారు. గ్రామానికి వెయ్యి మొక్కలు నాటాలని గ్రామాధికారులకు ఆదేశాలిచ్చారు.

పాపం వాళ్లే... గతంలో నాటిన మొక్కల బిల్లులే రాలేదని మొక్కల రేటు, ట్రీ గార్డులు, కూలీ ఖర్చులు ఎలా భరించాలని... గగ్గోలు పెట్టినా పట్టించుకోలేదు. వేసవి కాలంలో నీళ్లు లేక మొక్కలు బతక్కపోతే తమకు షోకాజులు పంపుతారని ఆవేదన చెందారు. ఇవేవీ సర్కారుకు పట్టలేదు. సారుకు తమ కుటుంబం, తన ఫాంహౌస్ పచ్చగా ఉంటే చాలు' అని విజ‌య‌శాంతి విమ‌ర్శించారు.
 
'గతంలో వేల కోట్ల రూపాయలతో మొక్కలు నాటే ప్రణాళిక సిద్ధం చేసి చేతులెత్తేశారు. తర్వాత ఉద్యానవన శాఖ అధికారి ఒకరితో సీఎం గారి ఫౌంహౌస్ నివాసంలో కోట్లాది రూపాయల విలువైన పనులు చేయించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
 
'సమయానికి జీతాలందక ఆర్టీసీ ఉద్యోగులు, జీహెచ్ఎంసీ ఉద్యోగులు వేదనకు గురవుతున్నా... బిల్లుల బకాయిలు పేరుకుపోతున్నా సర్కారు వారు నిర్లక్ష్యం వీడరు. ఈ అవినీతి, అసమర్థ, అబద్ధాల, విఫల ప్రభుత్వాన్ని నదులకు మొక్కులు, నాటి గాలికి వదిలేస్తున్న మొక్కలు... కాపాడతాయని ముఖ్యమంత్రి గారు అనుకుంటున్నట్లుంది. తెలంగాణ పాలకుల ఈ లెక్కలేనితనానికి తగిన గుణపాఠం చెప్పడానికి రాష్ట్ర ప్రజలు స్పష్టంగా ఎదురు చూస్తున్నారు' అని విజ‌య‌శాంతి విమ‌ర్శ‌లు గుప్పించారు.