చంద్రబాబు తుక్కు రాజకీయాలు కావాలో...వైసీపీ ఉక్కు సంకల్పం కావాలో ప్రజలే తేల్చుకోవాలి: విజయసాయి రెడ్డి

18-02-2021 Thu 10:19
  • నేడు విశాఖ ఉక్కు ఆవిర్భావ దినోత్సవం
  • ప్లాంటు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం
  • చంద్రబాబు దుర్మార్గపు కుట్రలన్న విజయసాయి
People to choose says Vijayasai Reddy

  విశాఖ స్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకున్న దరిమిలా ప్రభుత్వ, ప్రతిపక్ష వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ప్లాంటును విక్రయించాలని కేంద్రం ప్రయత్నిస్తుంటే, అది ప్రభుత్వ వైఫల్యమేనని తెలుగుదేశం, ఈ ప్రతిపాదన టీడీపీ పాలనలోనే వచ్చిందని వైసీపీ నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు గుప్పించుకుంటున్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, ఈ ఉదయం తన ట్విట్టర్ ఖాతాలో స్పందిస్తూ, "నేడు విశాఖ ఉక్కు కర్మాగారం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అందరికీ నా శుభాకాంక్షలు. కార్మికులతో కలిసి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ పోరాటాన్ని ఉద్ధృతం చేస్తుంది. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు. చంద్రబాబు తుక్కు రాజకీయాలు కావాలో...వైసీపీ ఉక్కు సంకల్పం కావాలో ప్రజలే తేల్చుకోవాలి" అన్నారు.

ఆపై, " అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన వార్నింగును లెక్క చేయకుండా హైదరాబాద్ లో కూర్చుని సంక్షేమ ప్రభుత్వంపై దుర్మార్గపు కుట్రలు చేసినందుకు పంచాయతీ తీర్పులో కుప్పం ప్రజలూ కన్నెర్ర జేసారు. ఇక తట్టాబుట్టా సర్దుకుని ఇంకో నియోజకవర్గాన్ని వెదుక్కోవడమే చంద్రబాబుకు మిగిలింది" అని టీడీపీపై సెటైర్లు కూడా వేశారు.