రీకౌంటింగ్ పేరుతో ఫలితాలను తారుమారు చేస్తున్నారు.. ఎస్ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు

18-02-2021 Thu 09:38
  • అధికార పార్టీ నేతలు, అధికారులు కుమ్మక్కయ్యారని ఫిర్యాదు
  • చాలా జిల్లాల్లో ఫలితాలను తారుమారు చేశారన్న టీడీపీ అధినేత
  • లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు ప్రకటించాలన్న బాబు
 Results are being manipulated in the name of recounting Chandrababu complained to SEC

అధికార వైసీపీ నేతలు, అధికారులు కుమ్మక్కై రీకౌంటింగ్ పేరుతో ఫలితాలను తారుమారు చేస్తున్నారంటూ టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎస్ఈసీకి ఫిర్యాదు చేశారు. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులు ఓడిపోయిన చోట్ల ఫలితాలను వెల్లడించకుండా రీకౌంటింగ్ పేరుతో ఫలితాలను తారుమారు చేస్తున్నారని చంద్రబాబు ఆ ఫిర్యాదులో ఆరోపించారు.

అనంతపురం జిల్లా సలకంచెరువు, ప్రకాశం జిల్లా చినపవని, కలవల్ల, విజయనగరం జిల్లా పర్ల, కృష్ణా జిల్లా ఆర్తమూరు, శ్రీకాకుళం జిల్లా బల్లేరు, చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం సింగసముద్రం, రాజుపేట, బందర్లపల్లి, గొరివిముకులపల్లి, పంద్యాలమడుగు, ముద్దనపల్లి, బైపరెడ్డిపల్లి, 89 పెద్దూరు, బాల్ల కుప్పం మండలం నదిమూర్, కంగుంది, వనగట్టుపల్లి పంచాయతీల్లో ఇలా ఫలితాలు తారుమారైనట్టు చంద్రబాబు  పేర్కొన్నారు. కాబట్టి లెక్కింపు పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడించేలా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు తన ఫిర్యాదు లేఖలో కోరారు.