మా నాన్నను చంపిన వారిని ఎప్పుడో క్షమించేశా.. వారిపై కోపం లేదు: రాహుల్ గాంధీ

18-02-2021 Thu 07:26
  • విద్యార్థిని ప్రశ్నకు రాహుల్ సమాధానం
  • తన తండ్రి తనలోనే, తనతోనే ఉన్నారన్న రాహుల్
  • తండ్రి మరణం తనను ఎంతగానో కుంగదీసిందని ఆవేదన
I Have forgiven my father assassination convicts

తన తండ్రిని చంపిన వారిపై తనకు ఎలాంటి కోపమూ లేదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. వారిని తనెప్పుడో క్షమించేశానని చెప్పారు. నిన్న పుదుచ్చేరిలో పర్యటించిన రాహుల్.. అక్కడి భారతీదాసన్ మహిళా కళాశాల విద్యార్థినులతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా ఓ విద్యార్థిని మాట్లాడుతూ.. ‘‘మీ నాన్నగారిని హత్యచేసిన ఎల్టీటీఈ వ్యక్తులపై మీ అభిప్రాయమేంటి?’’ అన్న ప్రశ్నకు రాహుల్ బదులిస్తూ.. తన తండ్రి మరణం తనను ఎంతగానో కుంగదీసిందని అన్నారు. తనకు  ఎవరిపైనా కోపం కానీ, ద్వేషం కానీ లేవని అన్నారు. హింస వల్ల ఎవరికీ ఒరిగేదేమీ ఉండదని, తన తండ్రిని హత్య చేసిన వారిని తాను క్షమించానని చెప్పారు. తన తండ్రి తనలోనే, తనతోనే ఉన్నారని, తన ద్వారా మాట్లాడుతున్నారని రాహుల్ అన్నారు.