వామనరావు దంపతుల హత్య టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యే: బండి సంజయ్

17-02-2021 Wed 22:03
  • ప్రభుత్వ అక్రమాలపై వామనరావు హైకోర్టులో పోరాడుతున్నారు
  • ప్రభుత్వ పెద్దల అవినీతి చిట్టా వామనరావు వద్ద ఉంది
  • ప్రశ్నించే గొంతుకకు రాష్ట్రంలో స్థానం లేదు
Vaman Raos murder is governments murder says Bandi Sanjay

హైకోర్టు న్యాయవాది వామనరావు దంపతుల హత్య ముమ్మాటికీ టీఆర్ఎస్ ప్రభుత్వ హత్యేనని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రభుత్వంలోని పెద్దల అవినీతి చిట్టా వామనరావు వద్ద ఉందని... అందుకే ఆయనను అంతమొందించారని అన్నారు. వామనరావు దంపతుల హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అక్రమాలపై వామనరావు పోరాటం చేస్తున్నారని  అన్నారు.

లాకప్ డెత్ లతో సహా పలు అక్రమాలపై హైకోర్టులో వామనరావు పిటిషన్లు వేశారని... వాటిపై పోరాటం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో అన్యాయానికి గురైన పేదల తరపున పోరాడుతున్నారని చెప్పారు. వామనరావుకు రక్షణ కల్పించాలని హైకోర్టు ఆదేశించిందని... ఆ ఆదేశాలను కూడా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకకు తెలంగాణలో స్థానం లేదని చెప్పేందుకు ఈ హత్యలే నిదర్శనమని చెప్పారు. ఈ హత్యలపై కేసీఆర్ స్పందించాలని డిమాండ్ చేశారు. హైదరాబాదులోని బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.