వచ్చే నెల 4న తిరుపతికి వస్తున్న అమిత్ షా

17-02-2021 Wed 19:02
  • మార్చి 4, 5 తేదీల్లో తిరుపతిలో పర్యటించనున్న అమిత్ షా
  • 4న దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం
  • 5న తిరుపతి ఉపఎన్నికపై బీజేపీ నేతలతో భేటీ కానున్న అమిత్ షా
Amit Shah visiting Tirupati on March 4

కేంద్ర హోంమంత్రి అమిత్ షా వచ్చే నెల 4న తిరుపతికి వస్తున్నారు. 4, 5 తేదీల్లో ఆయన తిరుపతిలో ఉండనున్నారు. ఆయన అధ్యక్షతన తిరుపతిలో మార్చి 4న దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి దక్షిణాది ముఖ్యమంత్రులు హాజరవనున్నారు. దక్షిణాది రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న నీళ్ల పంచాయతీలకు పరిష్కారాన్ని కనుగొనడం ప్రధాన అజెండాగా ఈ సదస్సులో చర్చ జరగనుంది. కృష్ణా, గోదావరి, పెన్నా, కావేరి నదుల అనుసంధానంపై కూడా ఈ సదస్సులో చర్చించనున్నారు.

ఈ భేటీకి ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్, లక్షద్వీప్ లకు చెందిన ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, లెఫ్టినెంట్ గవర్నర్లు హాజరుకానున్నారు. మొత్తం 90 నుంచి 100 వరకు ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. 5వ తేదీన తిరుపతి ఉపఎన్నికలపై పార్టీ నేతలతో అమిత్ షా భేటీ కానున్నట్టు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి మండలి సమావేశం జరగనుండటం ఇది 29వ సారి.