నిర్మాతగా మారిన యువ కథానాయిక!

17-02-2021 Wed 16:34
  • 'చిన్నారి పెళ్లికూతురు'తో పేరుతెచ్చుకున్న అవిక గోర్
  • 'ఉయ్యాల జంపాల' ద్వారా కథానాయికగా ప్రవేశం
  • 'అవికా స్క్రీన్స్ క్రియేషన్స్' బ్యానర్ పై చిత్ర నిర్మాణం
Avika Gore turns producer

కథానాయికలు తమకు డిమాండు ఉన్నంతవరకూ సినిమాల్లో నటిస్తూ.. మేగ్జిమమ్ ఎంత సంపాదించుకోగలరో అంతా సంపాదించేసుకుంటారు. తమ డిమాండును బట్టి ఎప్పటికప్పుడు పారితోషికాన్ని పెంచుకుంటూపోతారు. మధ్యలో వాణిజ్య చిత్రాలు చేయడం.. షాపుల ఓపెనింగులకు వెళ్లడం ద్వారా మరింత సంపాదిస్తారు. ఇప్పుడైతే ఓటీటీ వేదికపై కూడా మంచి అవకాశాలు వున్నాయి కాబట్టి, వాటి ద్వారా కూడా అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. అంతేగానీ, కథానాయికలు చిత్ర నిర్మాణంలోకి దిగడం మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. అయితే, ఇందుకు భిన్నంగా యువ కథానాయిక అవిక గోర్ ఇప్పుడు నిర్మాతగా కూడా మారింది.

'చిన్నారి పెళ్లికూతురు' సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది.. 'ఉయ్యాల జంపాల' సినిమా ద్వారా కథానాయికగా పరిచయమై.. ఆ తర్వాత 'సినిమా చూపిస్త మావా' వంటి సినిమాలలో నటించింది. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడు తెలుగు సినిమాలలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా నిర్మాతగా మారుతూ, 'అవికా స్క్రీన్స్ క్రియేషన్స్' అనే సంస్థను నెలకొల్పింది. భోగేంద్రగుప్తా మడుపల్లితో కలసి ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో సాయిరోనక్, అవికా గోర్ జంటగా నటిస్తున్నారు.

దీని గురించి అవిక చెబుతూ, 'చిన్నప్పటి నుంచీ టీవీ, సినిమా రంగంలోనే వున్నాను. అన్నీ చూస్తున్నాను.. చిత్ర నిర్మాణం గురించి తెలుసు.. అందుకే నిర్మాతగా మారాను' అని చెప్పింది.