France: ‘ఇస్లాం తీవ్రవాద’ వ్యతిరేక బిల్లును పాస్​ చేసిన ఫ్రాన్స్​ దిగువసభ

  • హింసను ప్రేరేపిస్తే మత సంస్థలపై నిషేధం
  • రాజ్యాంగ విలువలు పాటిస్తామనే డిక్లరేషన్ తప్పనిసరి
  • టర్కీ, ఖతార్, సౌదీల నుంచి వచ్చే మత విరాళాలపై ఆంక్షలు
  • 10 వేల యూరోలకు పైన వచ్చే వాటికి లెక్కలు తప్పనిసరి
  • అమ్మాయిలకు కన్యత్వ పరీక్షలు చేసే డాక్టర్లకు జైలు
France approves bill to battle Islamist extremism

‘ఇస్లాం తీవ్రవాదం’పై ఫ్రాన్స్ కఠినంగా వ్యవహరిస్తోంది. ఐదేళ్ల క్రితం జరిగిన ‘చార్లీ హెబ్డో’ ఘటన.. ఇటీవలి టీచర్ కిరాతక హత్య ఘటనల నేపథ్యంలో ప్రవేశపెట్టిన ఇస్లాం తీవ్రవాద వ్యతిరేక బిల్లుకు ఫ్రాన్స్ దిగువ సభ ఆమోదం తెలిపింది. 347 మంది ఎంపీలు బిల్లుకు మద్దతు తెలుపగా, 151 మంది వ్యతిరేకించారు. మరో 65 మంది ఓటింగ్ లో పాల్గొనలేదు. దీంతో దిగువ సభలో భారీ మెజారిటీతో బిల్లు పాసైంది. అయితే, ఆ బిల్లును ఇప్పుడు ఎగువ సభ అయిన సెనేట్ కు పంపాల్సి ఉంది. అక్కడ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ పార్టీకి మెజారిటీ లేదు.

బిల్లులో ఏముంది?

  • విద్వేషం, హింసను ప్రేరేపించే సిద్ధాంతాలను బోధిస్తున్నట్టు తెలిస్తే.. ప్రార్థన స్థలాలను మూసే హక్కు, వాటిపై నిషేధం విధించే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది.
  • తీవ్రవాద సిద్ధాంతాలను అనుసరించే వారి నుంచి ముప్పు ఎదురయ్యే మితవాద నేతలకు చట్టం రక్షణ కల్పిస్తుంది.
  • దేశంలో సబ్సిడీలు, పథకాలు అందాలంటే ఫ్రాన్స్ పాటించే రాజ్యాంగ, గణతంత్ర విలువలు, స్వేచ్ఛా విలువలను పాటిస్తామంటూ మత సంఘాలు లిఖితపూర్వక అంగీకారాన్ని తెలియజేయాలి.
  • టర్కీ, ఖతార్, సౌదీ అరేబియా వంటి దేశాల నుంచి వచ్చే మత నిధులపై ఆంక్షలు. 10 వేల యూరోలకు పైబడి వచ్చే విరాళాలన్నింటికీ మత సంఘాలు ముందే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
  • పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ నిబంధనల నుంచి మినహాయింపునివ్వాలన్న డిమాండ్ తో ప్రభుత్వాధికారిపై దాడి చేసినా, బెదిరింపులకు పాల్పడినా ఐదేళ్ల వరకూ జైలు శిక్ష.
  • మూడేళ్లు దాటిన పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో కాకుండా ఇస్లాం విద్యాసంస్థల్లో తల్లిదండ్రులు చేర్పించకుండా ఉండేందుకు కఠిన నిబంధనలు.
  • అమ్మాయిలకు కన్యత్వ పరీక్షలు చేసే డాక్టర్లకు జరిమానా లేదా జైలు శిక్ష విధింపు.
  • ఒకటి కన్నా ఎక్కువ పెళ్లిళ్లు చేసుకున్న దరఖాస్తుదారులకు నివాస పత్రాలను అందించే పనికి సంబంధించి అధికారులపై నిషేధం.

వరుస ఘటనల నేపథ్యంలో..

గత ఏడాది అక్టోబర్ 16న శామ్యూల్ పేటీ అనే ఓ ఉపాధ్యాయుడిని చెచెన్ ఇస్లామిస్ట్ ఉగ్రవాద సంస్థ అతి కిరాతకంగా చంపేసింది. అతడి తల నరికి ప్రాణాలు తీసింది. భావ స్వేచ్ఛకు సంబంధించిన పాఠాలు చెబుతూ ప్రవక్త మహ్మద్ కార్టూన్లను చూపించినందుకు ఉగ్రవాదులు ఈ ఘాతుకానికి తెగబడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఇస్లాం ఉగ్రవాదాన్ని అణచివేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తాయి. ఇదొక్కటే కాదు.. 2015 నుంచి ఐదేళ్లలో 250 మందికిపైగా ఆ దేశంలో ఉగ్రవాదానికి బలయ్యారు.

మహ్మద్ ప్రవక్త కార్టూన్ వేశారన్న కారణంతో 2015 జనవరిలో వారాంతపు పత్రిక అయిన చార్లీ హెబ్డోపై ఉగ్రవాదులు దాడి చేశారు. 12 మందిని చంపేశారు. ఆ తర్వాత వెంటనే ఓ ఫ్రెంచ్ మహిళా పోలీసును క్రూరంగా హత్య చేశారు. యూదు సూపర్ మార్కెట్ లో నలుగురు ఫ్రెంచ్ యూదులను ఊచకోత కోశారు. అదే ఏడాది నవంబర్ 13న స్టేట్ డి ఫ్రాన్స్ స్టేడియం, సెంట్రల్ పారిస్ లోని బార్లు, రెస్టారెంట్లు, బాటాక్లాన్ కాన్సర్ట్ హాల్ లో దాడులు చేసి 130 మందిని బలి తీసుకున్నారు. ఇవే కాదు.. ఇలాంటివి ఎన్నో ఘటనలు ఇటీవలి కాలంలోనూ జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఫ్రాన్స్ ఈ కొత్త బిల్లును తీసుకొచ్చింది.

అయితే, బిల్లుపై ముస్లిం వర్గాల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఇస్లామోఫోబియా పట్టుకుందని పలువురు స్వచ్ఛంద కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. వెంటనే బిల్లును ఉపసంహరించుకోవాలన్న డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

More Telugu News