మీరు కారణ జన్ములు: కేసీఆర్ పై హరీశ్ రావు ప్రశంసలు

17-02-2021 Wed 13:39
  • దశాబ్దాల తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది
  • బంగారు తెలంగాణ మీ వల్లే సాధ్యమవుతుంది
  • మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతోంది
Harish Rao praises KCR on his birthday

ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా టీఆర్ఎస్ పార్టీలో పండుగ సందడి నెలకొంది. టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో కేసీఆర్ కు ఆయన మేనల్లుడు, మంత్రి హరీశ్ రావు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు.

'మీరు కారణజన్ములు. మీ జన్మదినం తెలంగాణకు పండుగరోజు. తెలంగాణ తల్లి రుణం తీర్చుకున్న ఈ ముద్దు బిడ్డ నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఐదు కోట్ల ప్రజానీకం ఆశీర్వదిస్తున్నది. ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు.

దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ కల మీ వల్లే నెరవేరింది. భావి తరాల బంగారు తెలంగాణ మీ వల్లే సాధ్యమవుతుంది. మీరు ముఖ్యమంత్రి అయ్యాకే తెలంగాణ తలరాత మారింది. మీ నాయకత్వంలో రాష్ట్రం ప్రగతిపథంలో దూసుకుపోతున్నది. గత కాలపు వెతలన్నీ తీరి ఇంటింటా సంతోషం వెల్లివిరుస్తున్నది' అని ట్వీట్ చేశారు.

రాష్ట్ర చరిత్రలో యాసంగిలో ఏనాడు 20 లక్షల ఎకరాలకు మించేది కాదని... కానీ ఈ యాసంగిలో 50 లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చిందని హరీశ్ అన్నారు. కేసీఆర్ కాళేశ్వరం నీళ్లను తీసుకురావడం వల్లే ఇది సాధ్యమయిందని చెప్పారు. సిద్దిపేట ప్రాంతం ఒకనాడు తాగడానికి గుక్కెడు మంచినీళ్లు లేని దుస్థితి నుంచి యాసంగి పంటకు నీళ్లు ఇచ్చే స్థితికి చేరుకుందని... కేసీఆర్ ముందుచూపు వల్లే ఇది సాధ్యమయిందని అన్నారు. ఇది సిద్దిపేట ప్రజల అదృష్టమని అన్నారు.