రింకూ శర్మ కుటుంబానికి రూ.కోటి సాయం

17-02-2021 Wed 13:00
  • దేశవిదేశాల నుంచి విరాళాలు వెల్లువెత్తాయన్న కపిల్ మిశ్రా
  • నాలుగు దఫాలుగా బ్యాంకులో జమ చేస్తామని హామీ
  • ఈ నెల 26 నాటికి మొత్తం ఖాతాలో జమవుతుందని వెల్లడి
  • గత బుధవారం బర్త్ డే పార్టీలో హత్యకు గురైన రింకూ
Rinku Sharma murder Kapil Mishra announces Rs 1 crore aid for Mangolpuri youths family

ఢిల్లీలో హత్యకు గురైన తమ పార్టీ కార్యకర్త రింకూ శర్మ కుటుంబానికి ఢిల్లీ బీజేపీ నేత కపిల్ మిశ్రా ఆర్థిక సాయం ప్రకటించారు. కోటి రూపాయల ఆర్థిక సాయం అందజేస్తానని ప్రకటించారు. రింకూ శర్మ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ఇన్ స్టాల్ మెంట్ల రూపంలో రింకూ కుటుంబ సభ్యుల్లోని ఒకరి బ్యాంకు ఖాతాలోకి నేరుగా డబ్బులు జమ చేస్తామని హామీ ఇచ్చారు.

రింకూ కుటుంబాన్ని ఆదుకునేందుకు దేశవిదేశాల నుంచి కోటి రూపాయలకు పైగా విరాళాలు వచ్చాయన్నారు. ఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమ చేయడంపై బ్యాంకు మేనేజర్ తో మాట్లాడానని, రూ.25 లక్షల చొప్పున నాలుగు ఇన్ స్టాల్ మెంట్లలో సొమ్ము జమ చేస్తామని చెప్పారు. ఫిబ్రవరి 26 నాటికి మొత్తం రూ.కోటి జమవుతాయన్నారు. కాగా, ఎంపీ ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కూడా రింకూ శర్మ కుటుంబాన్ని పరామర్శించారు.

గత బుధవారం పుట్టినరోజు వేడుకల్లో జరిగిన గొడవలో మంగోల్ పురి ప్రాంతానికి చెందిన రింకూ శర్మను కొందరు వ్యక్తులు కత్తితో పొడిచి చంపిన సంగతి తెలిసిందే. దీనిపై రాజకీయ దుమారమూ చెలరేగింది. రామ మందిర నిర్మాణం కోసం ర్యాలీ తీస్తానన్నందుకే వేరే వర్గం వారు చంపేశారని రింకూ తల్లిదండ్రులు ఆరోపించారు. పోలీసులు మాత్రం బర్త్ డే గొడవలోనే హత్యకు గురయ్యాడని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.