నో అప్ డేట్... ప్రభాస్ అభిమానులకు మరోసారి నిరాశ!

17-02-2021 Wed 12:47
  • ప్రభాస్, నాగ్ అశ్విన్ ల కాంబోలో చిత్రం 
  • దీపిక హీరోయిన్.. అమితాబ్ కీలక పాత్ర
  • ఈ 26న అప్ డేట్ ఉంటుందన్న దర్శకుడు
  • తాజాగా ఫ్యాన్స్ కు 'సారీ' చెప్పిన నాగ్ అశ్విన్    
Prabhas fans upset again as there will be no update

ప్రభాస్ అభిమానులు మరోసారి నిరాశకు గురయ్యారు. తాజాగా దర్శకుడు నాగ్ అశ్విన్ చేసిన ట్వీట్ కు అభిమానులు డీలా పడ్డారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం 'ఆదిపురుష్', 'సలార్' చిత్రాలతో పాటు.. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న భారీ చిత్రంలో కూడా నటిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రానికి సంబంధించిన అప్ డేట్ కోసం ప్రభాస్ అభిమానులు గత కొంతకాలంగా ఎంతగానో  ఎదురుచూస్తున్నారు.

దీంతో మొన్నటి సంక్రాంతికి అప్ డేట్ ఉంటుందని దర్శకుడు నాగ్ అశ్విన్ అంతకుముందు ఫ్యాన్స్ కు చెప్పారు. అయితే, సంక్రాంతి వెళ్లిపోయినా ఏమీ లేకపోవడంతో అభిమానులు ప్రశ్నిస్తూ, ట్వీట్ల వర్షం కురిపించడంతో స్పందించిన దర్శకుడు 'జనవరి 29న కానీ, ఫిబ్రవరి 26న కానీ తప్పకుండా ఉంటుందని' భరోసా ఇచ్చాడు. దీంతో ఖుషీ అయిన ఫ్యాన్స్ దానికోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఇప్పుడు తాజాగా నాగ్ అశ్విన్ అప్ డేట్ లేదంటూ బాంబు పేల్చాడు.

"వెరీ సారీ.. 26న ఎటువంటి అప్ డేట్ ఇవ్వడం లేదు.. మన్నించండి.. అప్ డేట్ ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదు..' అంటూ తాజాగా నాగ్ అశ్విన్ ట్వీట్ ద్వారా పేర్కొన్నాడు. దీంతో ప్రభాస్ అభిమానులు మరోసారి తీవ్రంగా అప్ సెట్ అయ్యారనే  చెప్పచ్చు! ఇక వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో దీపిక పదుకొణే కథానాయికగా నటిస్తుండగా, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రను పోషించనున్నారు.