Jammu And Kashmir: కశ్మీర్​ కు చేరిన 24 దేశాల దౌత్యవేత్తలు

  • కశ్మీర్ సంప్రదాయం ప్రకారం ఘన స్వాగతం
  • 4జీ సేవల పునరుద్ధరణ నేపథ్యంలో రెండ్రోజుల పర్యటన
  • స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, ప్రజలతో సమావేశాలు
  • భద్రతా బలగాలతోనూ భేటీ అయ్యే అవకాశం
Foreign envoys arrive in JK on 2 day visit

జమ్మూకశ్మీర్ లో ఇటీవలే 4జీ ఇంటర్నెట్ సేవలను కేంద్రం పునరుద్ధరించింది. దీంతో అక్కడ పరిస్థితులను తెలుసుకునేందుకు 24 దేశాల దౌత్యవేత్తలు మరోసారి కశ్మీర్ పర్యటనకు వచ్చారు. బుధవారం శ్రీనగర్ కు చేరుకున్న ప్రతినిధులు రెండ్రోజుల పాటు అక్కడే ఉండి కొత్తగా ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, ప్రజలతో సమావేశం కానున్నారు.

చిలీ, బ్రెజిల్, క్యూబా, బొలీవియా, ఎస్టోనేషియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, ఈయూ, బెల్జియం, స్పెయిన్, స్వీడన్, ఇటలీ, బంగ్లాదేశ్, మలావి, ఎరిత్రియా, కోట్ డి ఐవరీ, ఘనా, సెనెగల్, మలేసియా, తజికిస్థాన్, కిర్గిస్థాన్ లకు చెందిన దౌత్యవేత్తలకు ప్రజలు కశ్మీర్ సంప్రదాయ పాటలతో ఘన స్వాగతం పలికారు. వారి పర్యటన నేపథ్యంలో కశ్మీర్ లో భారీగా బలగాలను మోహరించారు.  

బుద్గాం జిల్లాలోని మగం బ్లాక్ లోని పంచాయతీ రాజ్ అధికారులు, కొత్తగా ఎన్నికైన స్థానిక నేతలతో భేటీ అయ్యారు. గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు సమస్యలను ఎలా పరిష్కరిస్తున్నారో తెలుసుకున్నారు. స్థానిక ప్రజలతోనూ వారు మమేకమయ్యారు. వారి సమస్యలను తెలుసుకున్నారు. తర్వాత భద్రతా బలగాలతోనూ దౌత్యవేత్తలు సమావేశమవుతారని తెలుస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పాక్ ప్రోత్సహిస్తున్న తీరును వివరిస్తారని సమాచారం. కాగా, 2019 అక్టోబర్ లో యూరోపియన్ పార్లమెంట్ కు చెందిన 27 మంది సభ్యులు కశ్మీర్ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News