టీమిండియా విజ‌యంపై పీట‌ర్స‌న్ కామెంట్.. వసీం జాఫర్ ఆస‌క్తిక‌ర కౌంటర్

17-02-2021 Wed 11:34
  • ఇంగ్లండ్-బీ జట్టును ఓడించార‌న్న పీట‌ర్స‌న్
  • భారత్‌కు శుభాకాంక్షలు చెబుతున్నానంటూ  ట్వీట్
  • కెవిన్ పీటర్సన్‌ను ఎవరూ ట్రోల్ చేయ‌కూడ‌దన్న జాఫ‌ర్ 
jafer relies to england ex cricketer pietersen

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో చిత్తుగా ఓడిన భార‌త్ రెండో టెస్టులో మాత్రం ఘన విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకున్న విష‌యం తెలిసిందే. అయితే, దీనిపై ఇంగ్లండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్ చేసిన ట్వీట్ వైర‌ల్ అవుతోంది. ఇంగ్లండ్-బీ జట్టును ఓడించినందుకు భారత్‌కు శుభాకాంక్షలు చెబుతున్నానంటూ ఆయ‌న ట్వీట్ చేశారు.

దీంతో ఆయ‌న‌పై నెటిజ‌న్లు, క్రికెట్ అభిమానులు సెటైర్లు వేస్తుండ‌డంతో భారత మాజీ క్రికెటర్ వసీం జాఫర్ స్పందిస్తూ ఆయ‌న‌ను ట్రోల్ చేయొద్ద‌ని కోరారు. మ్యాచ్ లో ఇంగ్లండ్ ఓట‌మిపై పీటర్సన్ చేసిన‌ ట్వీట్‌ను ఆయ‌న‌ షేర్ చేశారు. ద‌యచేసి కెవిన్ పీటర్సన్‌ను ఎవరూ ట్రోల్ చేయ‌కూడ‌ద‌ని, ఆయ‌న‌ సరదాగానే ఇలాంటి ట్వీట్ చేశార‌ని జాఫ‌ర్ చెప్పారు.

అయితే, ఆయ‌న ట్వీట్‌ ద్వారా త‌నకో విషయం అర్థమైందని, దక్షిణాఫ్రికా వాళ్లు లేకుండా ఇంగ్లండ్ పూర్తి సామర్థ్యం కలిగిన జట్టు కాగ‌ల‌దా? అంటూ ఎద్దేవా చేశారు. కాగా, అప్ప‌ట్లో దక్షిణాఫ్రికా నుంచి పీటర్సన్‌ ఇంగ్లండ్‌కు వలస వెళ్లి అక్క‌డి క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించాడు. జాఫ‌ర్ ఇచ్చిన కౌంట‌ర్ నెటిజ‌న్లను ఆక‌ర్షిస్తోంది. టీమిండియా రెండో టెస్టులో 317 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించి, నాలుగు టెస్టుల సిరీస్‌‌ను భార‌త్‌ 1-1తో సమం చేసిన విష‌యం తెలిసిందే.