ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పెను సంచలనం!

17-02-2021 Wed 11:00
  • 25వ సీడ్ చేతిలో ఓడిపోయిన ఆష్లే బార్టీ
  • సెమీస్ కు చేరుకున్న కరోలినా ముచోవా
  • మరో మ్యాచ్ లో హలెప్ పై గెలిచిన సెరెనా
Top Seed Ashley Defeted in US Open Quarters

మెల్ బోర్న్ లో జరుగుతున్న ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ గ్రాండ్ స్లామ్ పోటీల్లో పెను సంచలనం నమోదైంది. ఈ టోర్నీలో టాప్ సీడ్ గా బరిలోకి దిగిన ఆష్లే బార్టీ క్వార్టర్ ఫైనల్ లోనే ఓటమి పాలైంది. ఇదే టోర్నీలో 25వ సీడ్ గా బరిలోకి దిగిన కరోలినా ముచోవా చేతిలో ఘోర ఓటమి పాలైంది. 6-1, 3-6, 2-6 తేడాతో బార్టీని ఓడించిన ముచోవా, సెమీ ఫైనల్స్ కు చేరుకుంది.

ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో తొలి సెట్ ను 6-1 తేడాతో ఓడిపోయిన ముచోవా, ఆపై పుంజుకుని బార్టీని ముప్పుతిప్పలు పెట్టింది. రెండో సెట్ ను 3-6 తేడాతో గెలుచుకున్న ముచోవా, అదే ఊపుతో ఆడి మూడో సెట్ లోనూ విజయం సాధించింది.

ఇక అన్ సీడెడ్ గా టోర్నీలో ప్రవేశించి క్వార్టర్స్ వరకూ చేరుకున్న జెస్సికా పెగులా, 22వ సీడ్ జెన్నిఫర్ బ్రాడీల మధ్య జరిగే మ్యాచ్ లో విజయం సాధించిన ప్లేయర్ తో ముచోవా సెమీస్ లో తలపడనుంది. మరో మ్యాచ్ లో పదో సీడ్ సెరెనా విలియమ్స్, రెండో సీడ్ గా పోటీలో దిగిన సిమోనా హలెప్ పై 6-3, 6-3 తేడాతో సులువుగా గెలిచి, సెమీస్ లో నయామీ ఒసాకాతో తలపడేందుకు సిద్ధమవుతోంది.