Joe Biden: అమెరికాలోని ప్రతి ఒక్కరికీ... జులై నాటికి వ్యాక్సినేషన్ పూర్తవుతుందన్న బైడెన్!

  • 60 కోట్ల టీకా డోస్ లు వస్తాయి
  • విద్యార్థులను స్కూళ్లకు పంపాలి
  • క్రిస్మస్ నాటికి సాధారణ పరిస్థితులు
  • అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
Vaccination will Finish in America by July says Biden

జులై నాటికి అమెరికాలోని ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియను పూర్తి చేస్తామని అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. తొలుత ఏప్రిల్ లోగానే ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని అమెరికా అంచనా వేసినప్పటికీ, టీకాల లభ్యత, పంపిణీలో నెలకొన్న కొన్ని అవాంతరాల నేపథ్యంలో లక్ష్యాన్ని చేరుకునేందుకు మరో మూడు నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

తాజాగా సీఎన్ఎన్ టౌన్ హాల్ లో జరిగిన సమావేశంలో పాల్గొన్న బైడెన్ ను, వ్యాక్సినేషన్ ఎప్పటికి పూర్తవుతుందని ప్రశ్నించగా, జులై చివరి నాటికి పూర్తవుతుందని తెలిపారు. "జులై నాటికి 60 కోట్ల డోస్ లు అందుబాటులోకి వస్తాయి. వాటితో ప్రతి అమెరికన్ కూ టీకా వేయడం పూర్తవుతుంది" అని ఆయన స్పష్టం చేశారు.

పాఠశాలలకు చిన్నారులను సాధ్యమైనంత త్వరగా పంపించే పరిస్థితులు దేశంలో ఏర్పడాలని కోరుకుంటున్నట్టు కూడా ఆయన తెలిపారు. వ్యాక్సినేషన్ తరువాతే ఇది సాకారం అవుతుందని, పిల్లల భవిష్యత్తు ప్రభావితం కారాదన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని బైడెన్ వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో అమెరికాలో తిరిగి సాధారణ జీవన పరిస్థితులు ఎప్పటికి ఏర్పడతాయన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ, తదుపరి క్రిస్మస్ సీజన్ నాటికి అంతా సర్దుకుంటుందని తెలిపారు. ఈ సంవత్సరం చివరికి దేశంలోని అతికొద్ది మంది మాత్రమే సామాజిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించి తిరిగే పరిస్థితి ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News