శ్రీలంకకూ బీజేపీని విస్తరిస్తామన్న త్రిపుర ముఖ్యమంత్రి.. స్పందించిన ఆ దేశ ఎన్నికల సంఘం

17-02-2021 Wed 10:15
  • దేశంలోని అన్ని రాష్ట్రాలను కైవసం చేసుకున్నాక ఇక విదేశాలపై దృష్టి
  • అమిత్ షా తనతో చెప్పారన్న బిప్లబ్ దేబ్
  • కలకలం రేపిన న్యూస్ పోర్టల్ కథనం
  • అలాంటిది కుదరదన్న శ్రీలంక ఎన్నికల కమిషన్
Sri Lanka Election Commission Responds on Tripura CM Comments

దేశంలోని అన్ని రాష్ట్రాలను కైవసం చేసుకున్న తర్వాత విదేశాలకు కూడా పార్టీని విస్తరించాలని వ్యూహరచన చేస్తున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తనతో చెప్పారని త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్ ఇటీవల వ్యాఖ్యానించారు. మన పార్టీ (బీజేపీ)ని శ్రీలంక, నేపాల్‌కు కూడా విస్తరించి, అక్కడ కూడా గెలిచి ప్రభుత్వాలను ఏర్పాటు చేయాలని అమిత్ షా తనతో అన్నట్టు త్రిపుర సీఎంను ఉటంకిస్తూ ఓ న్యూస్ పోర్టల్ ప్రచురించిన కథనం అందరి దృష్టిని ఆకర్షించింది.

ఈ వార్త కాస్తా శ్రీలంక ఎన్నికల కమిషన్ చైర్మన్ నిమల్ పుంచి హెవా దృష్టికి చేరడంతో ఆయన స్పందించారు. శ్రీలంకలోని ఎన్నికల చట్టాలు విదేశీ రాజకీయ పార్టీలను తమ దేశంలో అడుగుపెట్టడానికి అనుమతించబోవని స్పష్టం చేశారు. విదేశాల్లోని ఏదైనా పార్టీ, లేదంటే బృందంతో తమ దేశంలోని రాజకీయ పార్టీ, లేదంటే బృందం బాహ్య సంబంధాలను ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఉందని, కానీ విదేశీ రాజకీయ పార్టీలు శ్రీలంకలో కార్యకలాపాలు నిర్వహించేందుకు తమ చట్టాలు అనుమతించవని తేల్చి చెప్పారు.