Kiran Bedi: పుదుచ్చేరి గవర్నర్ గా తనను తొలగించిన తరువాత తొలిసారి స్పందించిన కిరణ్ బేడీ!

  • నన్ను నియమించిన కేంద్రానికి కృతజ్ఞతలు
  • ఏం చేసినా పవిత్ర భావంతోనే చేశాను
  • ప్రజా సంక్షేమానికే కృషి చేశానన్న కిరణ్ బేడీ
Kiran Bedi Comments after Remove as LG of Puduchcherry

తనను పుదుచ్చేరి గవర్నర్ గా తొలగించినట్టు ఉత్తర్వులు వెలువడిన తరువాత లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ తొలిసారిగా స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆమె, ఫేర్ వెల్ మెసేజ్ ని ఇచ్చారు. "పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా సాగిన నా ప్రయాణంలో తోడుగా నిలిచిన ప్రజలకు, అధికారులకు ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు" అంటూ ఆమె ఓ లేఖను విడుదల చేశారు.

తనను లెఫ్టినెంట్ గవర్నర్ గా పంపిన కేంద్ర ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలిపిన ఆమె, ఇది తనకు జీవితంలో మరపురాని అనుభూతని అన్నారు. తనతో సన్నిహితంగా మెలిగిన వారికి కూడా కృతజ్ఞతలు చెబుతున్నానని, తన పదవీ కాలంలో ప్రజల సంక్షేమం కోసమే కృషి చేశానని అన్నారు. రాజ్యాంగ పరమైన తన బాధ్యతలను నిర్వర్తించానని, నీతి నిజాయతీలకు కట్టుబడ్డానని పేర్కొన్న ఆమె, పుదుచ్చేరికి మంచి భవిష్యత్తు ఉండాలని, అది ప్రజల చేతుల్లోనే ఉందని అన్నారు.

తన బాధ్యతలను ఎంతో పవిత్రంగా నిర్వహించానని కిరణ్ బేడీ వ్యాఖ్యానించారు. కాగా, పుదుచ్చేరిలో రాజకీయ సంక్షోభం నెలకొనడం, దాని వెనుక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీయే కారణమని విమర్శలు రావడంతో కిరణ్ బేడీని ఎల్జీగా తొలగిస్తూ, రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం మేలో  పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతానికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తాత్కాలిక గవర్నర్ గా పుదుచ్చేరి బాధ్యతలను కూడా చూడనున్నారు.

More Telugu News