నిన్న తిరుమల వెంకన్న హుండీ ఆదాయం రూ. 3.43 కోట్లు!

17-02-2021 Wed 09:42
  • రథ సప్తమి ఏర్పాట్లు పూర్తి
  • నేడు సర్వదర్శనం టోకెన్ల జారీ
  • కల్యాణమస్తు కార్యక్రమానికి ముహూర్తాన్ని నిర్ణయించనున్న పండితులు
Heavy Rush in tirumala

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. మరో రెండు రోజుల్లో జరగనున్న రథ సప్తమి వేడుకల నిమిత్తం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇక, అదే రోజున స్వామివారి సర్వదర్శనం టోకెన్లను టీటీడీ నేడు జారీ చేయనుంది. నిన్న మంగళవారం నాడు స్వామిని సుమారు 50 వేల మందికి పైగా భక్తులు దర్శించుకోగా, 23,576 మంది తలనీలాలు సమర్పించారని అధికారులు తెలిపారు.

ఇదే సమయంలో స్వామివారికి భక్తులు ఇచ్చిన కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.43 కోట్లు వచ్చింది. వివాహం చేసుకోవాలని భావించే పేద యువతీ యువకులకు సాయపడేందుకు తలపెట్టిన 'కల్యాణమస్తు'కు నేడు టీటీడీ శ్రీకారం చుట్టనుంది. కల్యాణమస్తు ముహూర్తం నిర్ణయం నేడు నాద నీరాజనం వేదికపై ఖరారు కానుంది. ఆగమ శాస్త్ర పండితులు దేశవ్యాప్తంగా సామూహిక వివాహాలను జరిపించేందుకు నేడు మంచి రోజును నిర్ణయించనున్నారు.