మరో వివాదంలో పాప్‌స్టార్ రిహన్నా!

17-02-2021 Wed 09:30
  • ఇటీవల రైతుల ఆందోళనకు మద్దతునిచ్చిన రిహన్నా
  • టాప్‌లెస్‌గా.. మెడలో వినాయక ప్రతిమ ఉన్న నెక్లెస్ ధరించిన పాప్‌స్టార్
  • హిందూ మతాన్ని ఎందుకిలా కించపరుస్తున్నారని ఆవేదన
Rihanna Sparks Fresh Row as She Poses Naked with Lord Ganesha Pendant

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపి విమర్శలు ఎదుర్కొన్న అమెరికన్ పాప్‌స్టార్ రిహన్నా మరో వివాదంలో చిక్కుకుంది. నిన్న ఆమె పోస్టు చేసిన ఓ టాప్‌లెస్‌ ఫొటో దుమారం రేపుతోంది. ఆ ఫొటోలో టాప్‌లెస్‌గా కనిపించిన రిహన్నా ధరించిన నెక్లెస్సే ఈ దుమారానికి కారణం.

 ఆ నెక్లెస్‌‌కు వజ్రాలు పొదిగిన వినాయక ప్రతిమ ఉంది. టాప్‌లెస్‌గా ఉంటూ హిందూ దైవమైన విఘ్నేశ్వరుడి ప్రతిమను మెడలో వేసుకోవడంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. హిందువుల మనోభావాలను ఆమె దారుణంగా గాయపరిచిందని మండిపడుతున్నారు.

కళా సౌందర్యం పేరుతో హిందూ మతాన్ని, సంస్కృతిని వాడుకోవడం మానాలని రిహన్నాకు హితవు పలికారు. హిందుత్వాన్ని ఇలా ఎందుకు ఎగతాళి చేస్తున్నారంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అందరూ తమనే ఎగతాళి చేస్తుంటే ఇలానే సహిస్తూ ఉండాలా? అని ప్రశ్నిస్తున్నారు. రిహన్నా వెంటనే హిందువులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.