140 ట్యాంకులు, 60 ఆర్టిలరీ గన్స్, 7 వేల మందిని లడఖ్ నుంచి తరలించిన చైనా!

17-02-2021 Wed 08:40
  • దాదాపు సంవత్సరం పాటు కొనసాగిన ఉద్రిక్తతలు
  • క్రమంగా వెనక్కు వెళుతున్న సైన్యం
  • నార్త్ బ్యాంకులో చైనా బలగాలు లేవన్న సైన్యాధికారి
China Army Moving Back from Pongyong Lake

తూర్పు లడఖ్ ప్రాంతంలోని పాంగ్యాంగ్ సరస్సుకు ఇరువైపులా మోహరించి, వాస్తవాధీన రేఖపై పట్టుకోసం ప్రయత్నిస్తున్న భారత్, చైనా బలగాలు నిదానంగా వెనక్కు మళ్లుతున్నాయి. ఇందుకు సంబంధించిన పలు వీడియోలు, చిత్రాలను భారత ఆర్మీ విడుదల చేసింది. దాదాపు సంవత్సరం పాటు కొనసాగించిన ఉద్రిక్తతల అనంతరం ఇరువైపులా సైనికులు వెళ్లిపోతున్నారని ఉన్నతాధికారులు తెలిపారు.

చైనాకు చెందిన 130 నుంచి 140 ట్యాంకులు, 30 ఆర్టిలరీ గన్స్,  2000 మంది జవాన్లను సరస్సు దక్షిణం వైపు నుంచి, 30 ఆర్టిలరీ గన్స్, సుమారు 5 వేల మంది సైన్యాన్ని తూర్పు వైపు నుంచి చైనా వెనక్కు తీసుకుంది. ఇప్పుడిక నార్త్ బ్యాంకులో చైనా బలగాలు లేవని సైన్యాధికారి ఒకరు తెలిపారు. వారి చర్యలకు ప్రతిచర్యగా, ఇండియా కూడా బలగాలను ఉపసంహరించుకుందని స్పష్టం చేశారు.

ఇరు దేశాల మధ్య గత వారంలో జరిగిన చర్చలు సఫలీకృతం అయ్యాయని రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ గురువారం నాడు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజు నుంచే బలగాల ఉపసంహరణ పూర్తి కాగా, జరుగుతున్న పరిణామాలను ఇండియా నిశితంగా పరిశీలిస్తోంది. ఇదే సమయంలో తాము నిర్మించిన భారీ నిర్మాణాలను సైతం చైనా తొలగించింది. వేలాది మంది చైనా జవాన్లు ఆ ప్రాంతం నుంచి తమ ఆయుధాలు, ఇతర సామగ్రితో వెళ్లిపోతున్న వీడియోలు కూడా విడుదల అయ్యాయి.

చైనా దళాలు ఫింగర్ 8 పాయింట్ వరకూ వెళ్లిపోగా, భారత దళాలు తమ శాశ్వత సైనిక కేంద్రమైన ధన్ సింగ్ థాపా పోస్ట్ (ఫింగర్ 3 పాయింట్ కు దగ్గరలో) వరకూ వెళ్లిపోయాయి. ఇక ఈ ప్రాంతంలో పెట్రోలింగ్ కు కూడా రెండు దేశాలూ ప్రయత్నించరాదని కూడా ఒప్పందం కుదిరింది.