ఇంటి నిర్మాణం కోసం దాచుకున్న రూ. 5 లక్షలు చెదలపాలు!

17-02-2021 Wed 07:31
  • కృష్ణా జిల్లా మైలవరంలో ఘటన
  • రెండేళ్లుగా పైసా పైసా కూడబెట్టుకున్న వైనం
  • పనికిరాకుండా పోయిన నోట్లను చూసి కన్నీరుమున్నీరు
5 lakh rupees destroyed by Termites in krishna dist

ఇల్లు కట్టుకుందామని పైసాపైసా కూడబెట్టి దాచుకున్న సొమ్ము చెదలపాలైంది. అది చూసి తట్టుకోలేని ఆ కుటుంబం కన్నీటి పర్యంతమవుతోంది. కృష్ణా జిల్లా మైలవరానికి చెందిన జమలయ్య స్థానిక విజయవాడ రోడ్డులోని వాటర్ ట్యాంకు వద్ద మాంసం దుకాణం నిర్వహిస్తున్నాడు. ప్రస్తుతం ఉన్న రేకుల ఇల్లు చిన్నగా ఉండడంతో దానిని పెద్దగా కట్టుకోవాలని భావించిన జమలయ్య అందుకోసం రూ. 10 లక్షలు పోగేయాలని నిర్ణయించుకున్నాడు.

గత రెండేళ్లుగా ప్రతి రోజు వ్యాపారంలో వచ్చే కొంత డబ్బును ఇంట్లోని ట్రంకు పెట్టెలో దాయడం మొదలుపెట్టాడు. అలా ఇప్పటి వరకు దాదాపు రూ. 5 లక్షలు పోగేశాడు. తాజాగా, ఓ లక్ష రూపాయలు అవసరం ఉండడంతో పెట్టెను తెరవగా అందులోని దృశ్యం చూసి హతాశుడయ్యాడు. నోట్లన్నీ చెదలుపట్టి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. కష్టపడి దాచుకున్న డబ్బు చెదలపాలు కావడంతో గుండెలవిసేలా రోదిస్తున్నాడు. విషయం తెలిసిన పోలీసులు జమలయ్య ఇంటికొచ్చి ఆరా తీశారు.