పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీపై వేటు.. తమిళిసైకి అదనపు బాధ్యతలు

17-02-2021 Wed 06:29
  • ఉన్నట్టుండి కిరణ్ బేడీని తొలగించిన కేంద్రం
  • గత రాత్రి ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్రపతి భవన్
  • సీఎంతో ఘర్షణాత్మక వైఖరే కారణమా?
Kiran Bedi Removed As Puducherry Lt Governor

కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీని ఆ పదవి నుంచి తప్పిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి గత రాత్రి  అధికారిక ప్రకటన విడుదలైంది. ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కొత్త గవర్నర్ నియామకం వరకు తమిళిసై అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. కిరణ్‌బేడీని ఉన్నట్టుండి తొలగించడానికి గల కారణాలు తెలియరాలేదు. దీంతో ఆమెపై వేటుకు గల కారణాలపై చర్చ జరుగుతోంది.

త్వరలో ఇక్కడ ఎన్నికలు జరగనున్న వేళ అకస్మాత్తుగా జరిగిన ఈ మార్పు వెనక రాజకీయ పరమైన కారణాలు ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు, ముఖ్యమంత్రి నారాయణస్వామితో తొలి నుంచీ ఘర్షణాత్మక వైఖరే ఆమె తొలగింపునకు కారణం అయి ఉండొచ్చని కూడా అంటున్నారు.