సీఎం ఆఫ్ ద ఇయర్...  వైఎస్ జగన్ కు ప్రతిష్ఠాత్మక స్కోచ్ అవార్డు

16-02-2021 Tue 19:14
  • సీఎం జగన్ ను కలిసిన స్కోచ్ గ్రూపు అధినేత
  • స్కోచ్ అవార్డు ప్రదానం
  • సాహసోపేత నిర్ణయాలు తీసుకున్నారంటూ కితాబు
  • కరోనా వ్యాప్తి సమయంలో సమర్థ పాలన అంటూ ప్రశంసలు
YS Jagan wins SKOCH best cm of the year award

ఏపీ సీఎం జగన్ ను ప్రతిష్ఠాత్మకమైన స్కోచ్ అవార్డు వరించింది. దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా మెరుగైన పనితీరు కనబర్చినందుకు వైఎస్ జగన్ ను స్కోచ్ అవార్డుకు ఎంపిక చేశారు. ఇవాళ స్కోచ్ గ్రూప్ సంస్థల అధినేత సమీర్ కొచ్చర్ తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్ ను కలిశారు. ఈ సందర్భగా సీఎం ఆఫ్ ద ఇయర్ గా జగన్ కు స్కోచ్ అవార్డు ప్రదానం చేశారు.

కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాలు, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, దిశ చట్టం, వైఎస్సార్ చేయూత వంటి పథకాలను పరిగణనలోకి తీసుకుని సీఎం జగన్ ను అవార్డుకు ఎంపిక చేసినట్టు స్కోచ్ గ్రూప్ వెల్లడించింది. కరోనా వ్యాప్తి చెందుతున్న కాలంలోనూ 123 పథకాలను అమలు చేయడమే కాకుండా, కొన్ని సాహసోపేత నిర్ణయాలతో సీఎం పదవికి వన్నె తెచ్చారని వివరించింది. కాగా, సీఎం పదవి చేపట్టిన ఏడాదిన్నర కాలంలోనే జగన్ ఇంతటి ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకోవడం విశేషం అని వైసీపీ వర్గాలంటున్నాయి.