AP High Court: పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ వీడియోగ్రఫీపై హైకోర్టు కీలక ఆదేశాలు

High Court orders on Video recording on votes counting
  • ఓట్ల లెక్కింపును వీడియో తీయాలంటూ ఎస్ఈసీ ఆదేశాలు
  • ఆదేశాలు అమలయ్యేలా చూడాలంటూ హైకోర్టులో పిటిషన్లు 
  • ఇవాళ తీర్పు వెలువరించిన వైనం
  • ఓటరు కోరితే వీడియో తీయాల్సిందేనని స్పష్టీకరణ
పంచాయతీ ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులో ఓటరు కోరితే వీడియో తీయాల్సిందేనని ఏపీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓట్ల లెక్కింపులో అక్రమాలు చోటుచేసుకోకుండా ఆ ప్రక్రియను వీడియో తీయాలంటూ ఇటీవల ఎస్ఈసీ ఆదేశాలు ఇవ్వగా, ఆ ఆదేశాలు అమలు జరిగేలా చూడాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలవడం తెలిసిందే.

కృష్ణా జిల్లాకు చెందిన శ్రీపతి నాంచారయ్య, గుంటూరు జిల్లాకు చెందిన ప్రతాప్ నాయక్ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు నిన్న విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. వీడియోగ్రఫీ విషయంలో ఎస్ఈసీ ఆదేశాలు అమలు కావడంలేదని, కనీసం మూడు, నాలుగు విడతల పంచాయతీ ఎన్నికల్లోనైనా ఓట్ల లెక్కింపును వీడియో తీసేలా ఆదేశించాలని కోరారు.

 ఈ విచారణలో ఎస్ఈసీ తరఫున న్యాయవాది అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. వీడియో తీసే అంశంలో ఈ నెల 13న ఇచ్చిన ఉత్తర్వులకు రెండ్రోజుల తర్వాత సవరణ ఉత్తర్వులు కూడా జారీ చేశామని చెప్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కెమెరాల ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చామని, అయితే గ్రామీణ ప్రాంతాల్లో సాంకేతిక పరమైన ఇబ్బందులు  ఉండడంతో అక్కడ పూర్తిగా సీసీ కెమెరాల ఏర్పాటు సాధ్యం కాదని కోర్టుకు వివరించారు.

దాంతో జస్టిస్ సోమయాజులు ధర్మాసనం స్పందిస్తూ, సున్నితమైన, అత్యంత సున్నితమైన ప్రాంతాలను ఎలా వర్గీకరిస్తారంటూ ప్రభుత్వాన్ని, ఎస్ఈసీని ప్రశ్నించింది. తగిన వివరాలు అందించాలంటూ ఈ కేసును నేటికి వాయిదా వేసింది.

దీనిపై ఇవాళ తీర్పునిస్తూ ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియో తీయాలని ఏ ఒక్క ఓటరు కోరినా, ఆ మేరకు వీడియో చిత్రీకరించాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. టెక్నాలజీ సాకులు చెప్పొద్దని హితవు పలికింది. పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపును వీడియో తీయాలంటూ ఈ నెల 13న ఎస్ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను పాటించాలని ఆదేశించింది. అదే సమయంలో, ఎన్నికలు పక్షపాతానికి తావులేకుండా, పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత ఎస్ఈసీదేనని పేర్కొంది. 
AP High Court
Video Recording
Votes Counting
Gram Panchayat Elections
Andhra Pradesh

More Telugu News