ఈ ఐదేళ్లు వర్షాలు రాకూడదని దేవుడిని మొక్కుకుంటాను: జీహెచ్ఎంసీ కొత్త మేయ‌ర్ వ్యాఖ్య‌ల వీడియో వైర‌ల్

16-02-2021 Tue 13:32
  • టీవీ చానెల్‌కు గ‌ద్వాల విజ‌య‌ల‌క్ష్మి ఇంట‌ర్వ్యూ
  • కొన్ని నెల‌ల క్రితం వచ్చిన వర్షాల ప్ర‌స్తావ‌న‌
  • ఆ విష‌యంపై జ‌ర్నలిస్టు ప్ర‌శ్నించ‌గా స‌మాధానం
mayor video goes viral

‘ఫస్ట్ నేను దేవుడిని మొక్కుకుంటాను. ఈ ఐదేళ్లు వర్షాలు అవీ రాకూడదని’ అంటూ గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ కొత్త‌ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి వ్యాఖ్యానించ‌డం అంద‌రినీ విస్తుపోయేలా చేస్తోంది. ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆమె చేసిన వ్యాఖ్య‌ల‌కు సంబంధించిన వీడియోను మరో న్యూస్ చానెల్ ప్ర‌సారం చేసింది.

సామాజిక మాధ్య‌మాల్లో ఇప్పుడు ఈ వీడియో వైర‌ల్ అవుతోంది. కొన్ని నెల‌ల క్రితం భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో హైద‌రాబాద్ అత‌లాకుత‌ల‌మైన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆ విష‌యంపై ఇంట‌ర్వ్యూ చేస్తోన్న జ‌ర్నలిస్టు ప్ర‌శ్నించ‌గా విజ‌య‌ల‌క్ష్మి ఆ వ్యాఖ్య‌లు చేశారు. కాగా, ప్రజల సమస్యలు తీర్చేందుకు స‌ర్కారుతో పాటు జీహెచ్‌ఎంసీ చేయాల్సినవన్నీ చేస్తున్నాయ‌ని, దీనిపై ప్రజలు కూడా ఆలోచించాలని ఆమె అన్నారు. నాలాల ఆక్రమణల వల్లే వ‌ర్షాల‌కు కాలనీలు, ఇళ్లు మునుగుతున్నాయని చెప్పుకొచ్చారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె చెప్పారు.