హిందీలో డబ్బింగ్ చెప్పనున్న విజయ్ దేవరకొండ

16-02-2021 Tue 13:09
  • పూరి దర్శకత్వంలో విజయ్ 'లైగర్'
  • ఏకకాలంలో హిందీలో కూడా నిర్మాణం
  • విజయ్ ని డబ్బింగ్ చెప్పమన్న కరణ్
  • ప్రాక్టీస్ చేస్తున్న విజయ్ దేవరకొండ  
Vijay Devarakonda to dub in Hindi

'లైగర్' సినిమా ద్వారా విజయ్ దేవరకొండ బాలీవుడ్ కి కూడా పరిచయం అవుతున్నాడు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు హిందీలో కూడా ఏకకాలంలో నిర్మిస్తున్నారు. హిందీ వెర్షన్ కి ప్రముఖ ఫిలిం మేకర్ కరణ్ జొహార్ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రం తాజా షెడ్యూలు షూటింగ్ గత కొన్ని రోజులుగా ముంబైలో జరుగుతోంది.

ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఒక అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే, ఈ చిత్రం హిందీ వెర్షన్ కి కూడా విజయ్ దేవరకొండ డబ్బింగ్ చెప్పనున్నాడట. కరణ్ జొహార్ పట్టుబట్టడంతో తన పాత్రకు తాను డబ్బింగ్ చెప్పడానికి విజయ్ రెడీ అవుతున్నట్టు చెబుతున్నారు. విజయ్ కి హిందీ బాగానే వచ్చినప్పటికీ, డబ్బింగ్ చెప్పే విధంగా ప్రస్తుతం హిందీని ప్రాక్టీస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది. సెప్టెంబర్ 9న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.