'ఉప్పెన' తమిళ రీమేక్ లో స్టార్ హీరో తనయుడు?

16-02-2021 Tue 09:43
  • చిరు మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా 'ఉప్పెన'
  • బాక్సాఫీసు హిట్టుగా నిలిచిన సినిమా
  • దర్శకుడు బుచ్చిబాబు ప్రతిభకి ప్రశంసలు
  • రీమేక్ లో హీరో విజయ్ తనయుడు సంజయ్  
Tamil hero Vijay eyes on Uppena remake

వెరైటీ ప్రేమకథా చిత్రంగా 'ఉప్పెన' ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అయిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు బుచ్చిబాబు దర్శకత్వం వహించాడు. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు నుంచే మంచి హిట్ టాక్ వచ్చింది. సరికొత్త ప్రేమకథని వినూత్నంగా తెరపై ప్రెజంట్ చేసిన దర్శకుడి ప్రతిభను అందరూ ప్రశంసిస్తున్నారు. బాక్సాఫీసు వద్ద ఈ చిత్రం ఘనవిజయం సాధిస్తుండటంతో ఈ చిత్రం రీమేక్ హక్కుల కోసం అప్పుడే వివిధ భాషల నుంచి ఒత్తిడి మొదలైనట్టు చెబుతున్నారు.

ఈ క్రమంలో ఈ చిత్రంపై తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా కన్నేశాడట. తన తనయుడు సంజయ్ ను హీరోగా పరిచయం చేయాలన్న తలంపుతో గత కొంత కాలంగా విజయ్ మంచి కథ కోసం చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో 'ఉప్పెన' సినిమా సాధించిన విజయంతో దీనిని తమిళంలో రీమేక్ చేస్తూ, తన కుమారుడిని హీరోగా పరిచయం చేయాలని ఆయన ప్రయత్నిస్తున్నాడట. ఇప్పటికే నిర్మాతలతో రీమేక్ హక్కుల విషయంలో సంప్రదింపులు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం వుంది.