Guntur District: టీడీపీ మద్దతుదారులకు ఓటేశారట.. వీధిలోని ఇంటి మెట్లను కూల్చేసిన అధికారులు!

Authorities demolished the stairs of the house of TDP supporters
  • నరసరావుపేట మండలంలోని ఇసప్పాలెంలో ఘటన
  • టీడీపీ మద్దతుదారులకు ఓట్లేసిన బిల్డర్ బంధువులు
  • ప్రజాప్రతినిధి ఒత్తిడితో జేసీబీతో వెళ్లి మెట్లు, ర్యాంపులు కూల్చేసిన అధికారులు
గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం ఇసప్పాలెం పంచాయతీలో అధికారులు వ్యవహరించిన తీరు తీవ్ర వివాదాస్పదమైంది. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లు వేయలేదన్న కారణంతో ఓ వీధిలో బిల్డర్ నిర్మించిన పది ఇంటి మెట్లను కూల్చేశారు.

ఎన్నికలకు ముందు వైసీపీ మద్దతుదారులకు ఓటు వేయాలని తమపై ఒత్తిడి చేశారని, వేయకపోవడంతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రొంపిచర్ల మండలంలోని గోగులపాడుకు చెందిన జవ్వాజి రమేశ్ బిల్డర్. ఏడాది క్రితం ఇసప్పాలెంలోని సరస్వతి శిశుమందిర్ సమీపంలో పది ఇళ్లు నిర్మించి అందులో కొన్నింటిని విక్రయించాడు. అందులోని ఓ ఇంట్లో రమేశ్ కుటుంబం నివసిస్తోంది.

గోగులపాడు సర్పంచ్ ఎన్నికల్లో రమేశ్ బంధువులు టీడీపీ మద్దతుదారులకు ఓట్లు వేశారని తెలిసి తనపై గ్రామ పెద్దలు కక్ష కట్టారని, ప్రజా ప్రతినిధితో ఒత్తిడి తెచ్చి తాను నిర్మించిన ఇళ్ల మెట్లను కూల్చివేశారని రమేశ్ ఆరోపించారు. కూల్చివేత సమయంలో తాను ఇంట్లో లేనని, తన అత్తమామలు జేసీబీకి అడ్డంపడినా ప్రయోజనం లేకపోయిందని రమేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే, తాను నిర్మించిన ఇళ్లకు అన్ని అనుమతులు ఉన్నాయని పేర్కొన్నాడు. ఇంటి ముందు మెట్లు, ర్యాంపులను కూల్చివేశారన్నారు. విషయం తెలిసి ఇంటికి వచ్చి అధికారులను ప్రశ్నిస్తే ప్రజాప్రతినిధి పేరు చెప్పి ఆయనతో మాట్లాడుకోవాలని చెప్పారని రమేశ్ వాపోయారు.
Guntur District
Narasarao Pet
TDP
YSRCP

More Telugu News