తమిళ దర్శకుడితో చేయడానికి రెడీ అవుతున్న రామ్!

15-02-2021 Mon 14:14
  • సంక్రాంతికి 'రెడ్ తో వచ్చిన రామ్ 
  • లింగుస్వామి దర్శకత్వంలో సినిమా
  • తెలుగు, తమిళ భాషల్లో నిర్మాణం  
Ram to work with Tamil director

తను చేస్తున్న సినిమాల జయాపజయాల మాట ఎలా ఉన్నప్పటికీ, ఎప్పటికప్పుడు వెరైటీ కథా చిత్రాలు చేయడానికే ఎనర్జిటిక్ హీరో రామ్ ఆసక్తి చూపుతుంటాడు. మూస కథా చిత్రాల జోలికి అసలు వెళ్లడు. కాస్త ఆలస్యమైనా కథ తనకు సంతృప్తికరంగా వచ్చిన తర్వాతే సెట్స్ కు వెళతాడు. ఈ క్రమంలో ఆమధ్య పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఇస్మార్ట్ శంకర్' చిత్రం చేసి, విజయాన్ని అందుకున్న రామ్.. ఈ సంక్రాంతికి 'రెడ్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ప్రస్తుతం తన తదుపరి చిత్రాన్ని ఫైనలైజ్ చేసే పనిలో రామ్ వున్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం చేసే అవకాశం ఉందంటూ ఇటీవల వార్తలు వఛ్చినప్పటికీ ఆ ప్రాజక్టు కాస్త ఆలస్యం అయ్యే అవకాశం వుంది. ఈ మధ్యలో మరో చిత్రాన్ని చేయాలని నిర్ణయించుకున్నాడట.

దీంతో తన తదుపరి చిత్రాన్ని 'పందెం కోడి' ఫేమ్ లింగుస్వామితో చేయడానికి రామ్  గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా అల్లు అర్జున్ తో సినిమా చేయాలని లింగుస్వామి ప్రయత్నిస్తున్నాడని, అయితే ఆ ప్రాజక్టు కార్యరూపం దాల్చడానికి మరికొంత సమయం పట్టేలా ఉండడంతో రామ్ తో తన తాజా ప్రాజక్టును సెట్ చేసుకున్నాడని సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కుతోందని అంటున్నారు.