ప్రకృతిపై మెగాస్టార్ చిరంజీవి కవితాత్మక స్పందన!

15-02-2021 Mon 13:25
  • ట్విట్టర్ లో చిరు ఆసక్తికరమైన పోస్టు
  • తన ఇంటి వెలుపల చిత్రీకరించిన వీడియోను షేర్ చేసిన వైనం
  • సూర్యోదయ, సూర్యాస్తమయాలపై చిరు భావుకత
  • ఎన్నిసార్లు చూసినా తనివి తీరదని వ్యాఖ్యలు
Chiranjeevi shares a video of nature beauty

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ప్రకృతి రమణీయతను ఎంతగానో ఇష్టపడతారన్న సంగతి తెలిసిందే. తాజాగా సూర్యోదయం, సూర్యాస్తమయాలను వీక్షించడం ఎంత మనోహరంగా ఉంటుందో సామాజిక మాధ్యమాల్లో వివరించారు. ఎన్ని రోజులు, నెలలు, సంవత్సరాలు, శతాబ్దాలు గడచినా సంధ్యాసమయాలు, భానోదయాల అందం అచ్చెరువొందిస్తూనే ఉంటుందని పేర్కొన్నారు.

"ఆ ఖగోళ అద్భుతాన్ని వర్ణించలేం, అంతా ఇంతా అని చెప్పలేం. ఎన్నిసార్లు వీక్షించినా తనివి తీరదు" అంటూ తనలోని భావుకతను ప్రదర్శించారు. 'ఇవాళ మా ఇంటి వెలుపల తీసిన ఓ వీడియోను పంచుకుంటున్నాను' అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. లాక్ డౌన్ సమయంలోనూ చిరు ఇలాంటివే కొన్ని వీడియోలను అభిమానులతో పంచుకున్నారు. తాజాగా పోస్టు చేసిన వీడియోకు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోంది.