toolkit: గ్రెటా థన్ బర్గ్ టూల్‌కిట్‌ వివాదంలో నిన్న దిశ అరెస్టు.. ఇప్పుడు నికితపై నాన్-బెయిలబుల్ వారెంట్

  • టూల్ కిట్ ను ఎడిట్ చేసి పోస్టులు చేశార‌ని ఆరోప‌ణ‌లు
  • ముంబై హైకోర్టు న్యాయవాది, సామాజిక‌ కార్యకర్త నికితా జాకబ్
  • ఆమెతో పాటు శాంతనుల అనే వ్య‌క్తిపై చ‌ర్య‌లు
  • ప‌రారీలో నికిత
 Nonbailable warrants issued against two

స్వీడన్ కి చెందిన పర్యావరణ కార్యకర్త గ్రెటా థన్ బర్గ్ షేర్ చేసిన టూల్ కిట్ (ఎడిట్ చేసేందుకు వీలుండే గూగుల్ డాక్యుమెంట్) వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు నిన్న‌ బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల  దిశ రవి అనే పర్యావరణ కార్యకర్తను అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. టూల్ కిట్ ను ఎడిట్ చేసి ఆమె పోస్టులు చేశార‌ని ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. ఆ టూల్‌ కిట్‌ వివాదం మరింత పెరుగుతోంది. ఇప్పుడు ఇదే కేసులో బాంబే హైకోర్టు న్యాయవాది, కార్యకర్త నికితా జాకబ్ తో పాటు శాంతను అనే మ‌రొక‌రిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి.

ఇటీవ‌ల‌ ప్ర‌త్యేక‌ సెల్ బృందం నికితా ఇంటికి వెళ్లి ఆమె ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను పరిశీలించి, వెళ్లింది. అనంత‌రం నికిత‌ పరారీలో ఉంది. నికితా జాకబ్, బెంగ‌ళూరు యువ‌తి దిశా రవి  మ‌రికొంద‌రు ఓ  జూమ్ సమావేశంలో  రైతు ఆందోళనకు సంబంధించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేశార‌ని పోలీసులు ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.

అంతేగాక‌, నిరసన కారుల్లో మ‌రింత‌ ఆందోళనను పెంచేందుకు కుట్ర పన్నారని చెబుతున్నారు. పోలీసుల తీరుపై దేశంలోని పలువురు నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. ఉద్య‌మ‌కారుల‌పై తీసుకుంటోన్న చ‌ర్య‌లు ప్రజాస్వామ్యంపై దాడి చేయ‌డ‌మేన‌ని, రైతులకు మద్దతు ఇవ్వడం నేరం కాదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.  

కాగా, ఈ కేసులో దిశా రవిని ఐదు రోజుల పోలీసు కస్టడీకి తరలించారు. వారు పోస్ట్ చేసిన గూగుల్ డాక్యుమెంట్ వెనుక ఖలిస్థాన్‌ అనుకూల సంస్థ ‘పొయెటిక్‌ జస్టిస్‌ ఫౌండేషన్‌’ హస్తం ఉన్నట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తాను అందులోని రెండు లైన్లను మాత్రమే ఎడిట్‌ చేశానని దిశా పోలీసు విచారణలో తెలిపింది.

More Telugu News