Stock Market: 52 వేల స్థాయిని దాటి.. ఆల్ టైమ్ రికార్డుకు సెన్సెక్స్!

  • ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా లాభం
  • ఆసియా మార్కెట్లన్నీ లాభాల్లోనే
  • ఏడాది గరిష్ఠానికి క్రూడాయిల్ ధర
Sensex Hits All Time Record

గత వారంలో ఒడిదుడుకుల మధ్య సాగిన భారత స్టాక్ మార్కెట్ నేడు మరోసారి జూలు విదిల్చింది. సెన్సెక్స్ బుల్ రంకెలేస్తూ, సరికొత్త రికార్డు స్థాయికి చేరుకుంది. చరిత్రలో తొలిసారిగా సెన్సెక్స్ సూచిక 52 వేల స్థాయిని దాటడం నేటి ట్రేడింగ్ లో విశేషం. సెషన్ ఆరంభంలోనే భారీ ఎత్తున కొనుగోళ్లు వెల్లువెత్తడంతో సెన్సెక్స్ 500 పాయింట్లకు పైగా లాభాన్ని ఆర్జించింది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 15,290 పాయింట్లకు చేరుకుంది. అన్ని సెక్టార్లూ లాభాల్లో నడుస్తున్నాయి.

ఈ ఉదయం 11 గంటల సమయంలో సెన్సెక్స్ 554 పాయింట్ల లాభంతో 52,098 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 143 పాయింట్ల లాభంతో 15,306 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 30లో డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్ సంస్థలు స్వల్ప నష్టాల్లో ఉండగా, మిగతా కంపెనీలన్నీ లాభాల్లో నడుస్తుండటం గమనార్హం.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్ గా ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ నడుస్తున్నాయి. బ్యాంకింగ్, టెక్, ఐటీ, రియల్టీలు లాభాల్లో ఉన్నాయి. ఇక ఆసియా మార్కెట్ల విషయానికి వస్తే, అన్ని దేశాల సూచీలూ లాభాల్లోనే ఉన్నాయి. నిక్కీ 1.65 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 0.44 శాతం, హాంగ్ సెంగ్ 0.45 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 0.61 శాతం, కోస్పీ 1.71 శాతం, సెట్ కాంపోజిట్ 1.17 శాతం, జకార్తా కాంపోజిట్ 0.82 శాతం, షాంగై కాంపోజిట్ 1.43 శాతం లాభపడ్డాయి.

ఇదిలావుండగా, ఇంటర్నేషనల్ మార్కెట్ లో క్రూడాయిల్ ధరలు 52 వారాల గరిష్ఠానికి చేరాయి. బ్రెంట్ ముడి చమురు ధర నేడు 66 సెంట్లు పెరిగి బ్యారెల్ కు 63.09 డాలర్లకు చేరుకుంది. గత సంవత్సరం జనవరి తరువాత బ్రెంట్ క్రూడాయిల్ కు ఈ స్థాయిలో ధర పలకడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

More Telugu News