New York: సర్వ్ చేసిన యువతికి రూ. 9.50 లక్షల టిప్!

  • న్యూయార్క్ రెస్టారెంట్ లో పనిచేస్తున్న ఉల్యానా
  • ఆమె గురించి తెలుసుకుని నిధుల సేకరణ
  • వచ్చిన డబ్బంతా తీసుకెళ్లి టిప్ గా ఇచ్చిన కస్టమర్
13 Thousand Dollors Tip for New York Waitress

ఏదైనా రెస్టారెంట్ కు వెళ్లి తిన్నా, తాగినా, మనకు సర్వ్ చేసిన వారికి ఎంతో కొంత టిప్ ఇచ్చి వస్తుంటాం. గతంలో ఎన్నో మార్లు తమకు నచ్చిన వెయిటర్లకు కొందరు కస్టమర్లు భారీగా టిప్ ఇచ్చిన ఘటనలు కూడా మనకు తెలుసు. తాజాగా, యూఎస్ లోని న్యూయార్క్ లో తనకు సర్వ్ చేసిన ఓ యువతికి ఓ కస్టమర్ ఏకంగా 13 వేల డాలర్లు (దాదాపు రూ. 9.42 లక్షలు) టిప్ గా ఇచ్చి ఆమెను అవాక్కు చేశాడు.

ఇక్కడ ఓ ట్విస్ట్ ఉందండోయ్. అవేమీ అతని డబ్బులు కాదు. తనది కాని డబ్బును ఎలా టిప్ గా ఇచ్చాడా? అని అనుకుంటున్నారా? అయితే, అసలు విషయానికి వెళ్లాల్సిందే. న్యూయార్క్ లో లిల్లీస్ కాక్ టైల్ రెస్టారెంట్ పేరిట ఓ హోటల్ ఉండగా, అక్కడ ఉల్యానా హ్రుచాక్ అనే యువతి వెయిట్రెస్ గా పని చేస్తోంది. ఆ హోటల్ కు రెగ్యులర్ గా వెళ్లే రాబిన్ స్కాల్ అనే కస్టమర్, ఆమెను చూసి, ఆమెకేదైనా సాయం చేయాలని భావించాడు.

తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో 1.41 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉండగా, వారందరికీ ఆమె గురించి చెప్పి, ఎంతో కొంత సాయం చేయాలని, తాను ఆమెకు డబ్బులు ఇచ్చి సాయపడతానని కోరాడు. ఈ పోస్ట్ పెట్టే సమయంలో ఓ 1000 డాలర్ల నిధిని సేకరించి, ఆమెకు ఇచ్చినా తనకు సంతోషమేనని రాబిన్ భావించాడు. అయితే, నిమిషాల వ్యవధిలోనే 13 వేల డాలర్లు పోగయ్యాయి.

దీంతో ఆ డబ్బును తీసుకుని రెస్టారెంట్ కు వెళ్లిన రాబిన్ స్కాల్, ఆమెకు మొత్తం తాను సేకరించిన మొత్తాన్ని టిప్ గా ఇచ్చి వచ్చాడు. తొలుత నమ్మలేకపోయినా, ఆపై విషయం తెలుసుకున్న ఆమె, స్కాల్ చేసిన సాయానికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆయన ఫాలోవర్లకు కూడా కృతజ్ఞతలు తెలిపింది.

More Telugu News