Municipal Elections: ఏపీలో ఇక మునిసిపల్ పోరు.. నేడో, రేపో ప్రకటన!

  • గతేడాది మార్చి 23న జరగాల్సిన ఎన్నికలు
  • కరోనా కారణంగా వాయిదా
  • ఆగిపోయిన చోటు నుంచే ఎన్నికల ప్రక్రియ
  • ఉన్నతాధికారులతో సమావేశం తర్వాత తేదీల ప్రకటన
Now AP SEC Eye On Municipal Elections

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల పర్వం దాదాపు ముగింపు దశకు చేరుకుంటుండడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పుడు పురపాలక ఎన్నికలపై దృష్టిసారించింది. పుర, నగర పాలక, నగర పంచాయతీల్లో ఎన్నికలకు సంబంధించి నేడో, రేపే ప్రకటన చేయనున్నట్టు తెలుస్తోంది.

అయితే, కరోనా కారణంగా గతేడాది ఎన్నికలు నిలిచిపోయిన చోటి నుంచే తిరిగి ఎన్నికల ప్రక్రియ ప్రారంభించాలని యోచిస్తోంది. అలాగే, ఇప్పటికే దాఖలైన నామినేషన్లకు సంబంధించి ఉపసంహరణ, పోలింగ్, ఓట్ల లెక్కింపునకు సంబంధించి మరోమారు తేదీలను ప్రకటించనుంది. ఈ నెలాఖరు నాటికే ఆ ఎన్నికలను కూడా పూర్తిచేయాలని ఎస్ఈసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

నిజానికి గతేడాది మార్చి 23న పురపాలక ఎన్నికలు జరగాల్సి ఉండగా, కరోనా కారణంగా అదే నెల 15న వాయిదా పడ్డాయి. అయితే, అప్పటికే 12 నగర పాలక సంస్థల్లోని డివిజన్లు, వార్డులకు 6,563 నామినేషన్లు దాఖలయ్యాయి. 75 పురపాలక, నగర పంచాయతీల్లో వార్డు స్థానాలకు 12,086 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, ఆ తర్వాత కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేశారు.

ప్రస్తుతం రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండడంతో అవి ముగిసిన తర్వాత ఈ ఎన్నికలు చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించినట్టు సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శితో ఎస్ఈసీ సమావేశం తర్వాత ఎన్నికల నిర్వహణ తేదీలను ఖరారు చేస్తారని సమాచారం.

More Telugu News