USA: వుహాన్ ల్యాబ్ నుంచి కరోనా రాలేదన్న డబ్ల్యూహెచ్ఓ నివేదికపై అమెరికా అసంతృప్తి

US Government not agreed to WHO report in Wuhan
  • కరోనా పుట్టింది వుహాన్ ల్యాబ్ లోనే అంటూ అమెరికా ఆరోపణలు
  • వుహాన్ లో పర్యటించిన డబ్ల్యూహెచ్ఓ బృందం
  • ఓ జంతువు నుంచి మనుషులకు వ్యాపించిందన్న డబ్ల్యూహెచ్ఓ
  • తమకు నమ్మకం లేదంటూ అమెరికా జాతీయ భద్రతా సలహదారు ప్రకటన

ప్రపంచ మానవాళిని తీవ్ర అస్థిరతకు గురిచేసిన కరోనా మహమ్మారి పుట్టుకపై నిగ్గు తేల్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చైనాలో పర్యటించడం తెలిసిందే. ఏదైనా అడవి జంతువు నుంచే మనుషులకు కరోనా వ్యాప్తి చెంది ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ అభిప్రాయపడింది. వుహాన్ వైరాలజీ ల్యాబ్ నుంచే కరోనా వ్యాప్తి చెంది ఉంటుందన్న వాదనలను కొట్టిపారేసింది. వుహాన్ ల్యాబ్ నుంచి వైరస్ లీకై, మనుషులకు వ్యాప్తి చెందే అవకాశాల్లేవని, బహుశా గబ్బిలం నుంచి మరో జంతువులోకి వ్యాపించి, ఆపై మనుషులకు వ్యాప్తి చెంది ఉంటుందని చైనాలో పర్యటించిన డబ్ల్యూహెచ్ఓ బృందం నాయకుడు పీటర్ బెన్ ఎంబ్రేక్ వెల్లడించారు.

అయితే డబ్ల్యూహెచ్ఓ ప్రకటనపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్ఓ తన నివేదికను స్వతంత్రంగా రూపొందిస్తే బాగుండేదని, చైనా ప్రభుత్వ మార్పులు, చేర్పుల నుంచి దూరంగా ఉంచాల్సిన అవసరం ఉందని పేర్కొంది. కరోనా వ్యాప్తి మొదలైనప్పటి సమాచారాన్ని తమతో పంచుకోవాలని, తిరిగి డబ్ల్యూహెచ్ఓలో చేరిన తమకు నమ్మకం కలిగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలీవన్ వెల్లడించారు. వుహాన్ లో డబ్ల్యూహెచ్ఓ బృందం అధ్యయనం సందర్భంగా ఉపయోగించిన ప్రశ్నావళి, సేకరించిన సమాచారంపై తమకు తీవ్రస్థాయిలో అభ్యంతరాలు ఉన్నాయని సలీవన్ స్పష్టం చేశారు.

కరోనా పుట్టింది వుహాన్ లోని వైరాలజీ ల్యాబ్ లోనే అంటూ నాటి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరించిన వైఖరినే ప్రస్తుతం జో బైడెన్ సర్కారు కూడా అనుసరిస్తున్నట్టు జాతీయ భద్రతా సలహాదారు ప్రకటనతో స్పష్టమైంది. ట్రంప్ హయాంలో డబ్ల్యూహెచ్ఓ తీరును నిరసిస్తూ ఆ సంస్థ నుంచి వైదొలగిన అమెరికా, ఇటీవలే మళ్లీ చేరింది.
USA
WHO
Corona Virus
Wuhan Lab
China

More Telugu News