Omar Abdullah: గృహ నిర్బంధంలో ఒమర్​ అబ్దుల్లా కుటుంబం.. ఇదీ నయా కశ్మీర్​ అంటూ ఒమర్​ అసహనం

  • తన తండ్రి, సోదరి, వారి పిల్లలనూ గదిలో పెట్టి తాళం వేశారని మండిపాటు
  • కారణం లేకుండా బంధించడమే మీ ప్రజాస్వామ్యమా అంటూ కేంద్రానికి చురక
  • ఇంటి పనివారిని రానివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం
  • లెథ్పోరా ఉగ్రదాడికి రెండేళ్లవుతున్నందువల్లేనన్న పోలీసులు
  • దాడులు జరిగే అవకాశం ఉన్నందువల్లే హౌస్ అరెస్ట్ చేశామని వివరణ
Omar Abdullah claims he his family put under house arrest

జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా మరోసారి కేంద్రంపై మండిపడ్డారు. ఆదివారం ఒమర్ సహా వారి కుటుంబ సభ్యులందరినీ అధికారులు గృహ నిర్బంధంలో పెట్టారు. దీంతో ఆయన ‘‘ఇదీ మన నయా కశ్మీర్’’ అంటూ ట్విట్టర్ లో అసహనం వ్యక్తం చేశారు.

సరైన కారణం లేకుండా, వివరణ లేకుండా తమను ఇంట్లో నిర్బంధించారని మండిపడ్డారు. ఓ సిట్టింగ్ ఎంపీ అయిన తన తండ్రి ఫరూక్ అబ్దుల్లానూ హౌస్ అరెస్ట్ చేయడం చాలా దారుణమన్నారు. తన సోదరి, వారి పిల్లలనూ గదిలో పెట్టి తాళం వేశారని ఆరోపించారు.

ఆగస్టు 2019 తర్వాత ఇదీ మన కశ్మీర్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కారణం లేకుండా తమను ఇంట్లో బంధించడమే ప్రభుత్వ ప్రజాస్వామ్య నమూనానా అంటూ కేంద్రానికి చురకలు అంటించారు. కనీసం ఇంటి పనివారిని రానివ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో కూడా తనకు కోపం రాకుండా ఉంటుందా అని ప్రశ్నించారు.

ఒమర్ వ్యాఖ్యలపై శ్రీనగర్ పోలీసులు స్పందించారు. లెథ్పోరా ఉగ్రదాడి ఘటనకు నేటితో రెండేళ్లు పూర్తయ్యాయని, ముఖ్యనేతలపై దాడులు జరిగే అవకాశమున్నందున బయటకు వచ్చేందుకు ఎవరినీ అనుమతించట్లేదని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి ముందే అందరికీ సమాచారమూ ఇచ్చామన్నారు.

అయితే, ఏ రూల్ ప్రకారం తమను హౌస్ అరెస్ట్ చేశారో చెప్పాలని ఒమర్ కౌంటర్ ఇచ్చారు. ఇల్లు విడిచి బయటకు రారాదంటూ తనకు సూచించొచ్చని, అంతేగానీ బలవంతంగా నిర్బంధించడమేంటని ప్రశ్నించారు. సరే, ముందే చెప్పామంటున్నారు కాబట్టి.. తనకు చెప్పినట్టు ఉన్న లిఖిత పూర్వక ఆదేశాలను చూపించాలని ఒమర్ డిమాండ్ చేశారు.

More Telugu News