తన లవ్ స్టోరీ గురించి చెప్పేసిన కాజల్ అగర్వాల్!

14-02-2021 Sun 09:10
  • కాఫీకి పిలిచేందుకే రెండు రోజులు
  • లాక్ డౌన్ సమయంలో దూరంగా ఉండటంతో పెరిగిన ప్రేమ
  • ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నామన్న కాజల్
Kajal Agarwal Love Story

అందాల నటి కాజల్ అగర్వాల్... గత సంవత్సరం తాను వలచిన గౌతమ్ కిచ్లూను పెళ్లి చేసుకుని కాజల్ కిచ్లూగా మారిపోయింది. నేడు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా తన లవ్ స్టోరీ గురించి కాజల్ చెప్పుకొచ్చింది. తనను కాఫీ తాగేందుకు వస్తావా? అని అడిగేందుకే గౌతమ్ కు రెండు రోజులు పట్టిందని మురిపెంగా చెప్పుకొచ్చింది. అంతవరకూ అతనెవరో తనకు తెలియలేదని, ఎంతో తక్కువ టైమ్ లోనే తనకు మంచి స్నేహితుడిగా మారిన వ్యక్తి గౌతమ్ అని పేర్కొంది.

వాస్తవానికి అప్పటికి పెళ్లి గురించి తనకు నమ్మకం ఉండేది కాదని, ఆ విషయం గమనించిన గౌతమ్, తన కోసం ఎంతో వేచి చూశాడని కాజల్ వ్యాఖ్యానించింది. ఫ్రెండ్స్ గా ఉన్న తామిద్దరి మధ్యా ప్రేమ ఎప్పుడు పుట్టిందో కూడా తనకు తెలియదని చెప్పింది. ఉత్తరాలు రాసుకుంటూ తమ భావాలను తెలుపుకుంటూ ఉండేవాళ్లమని, ఈలోగా కరోనా రావడంతో నిబంధనల కారణంగా దూరంగా ఉండిపోయామని, అదే తామిద్దరి మధ్యా ప్రేమను పెంచిందని కాజల్ వెల్లడించింది.

కొన్ని వారాల తరువాత తామిద్దరమూ మాస్క్ లు ధరించి, ఓ దుకాణంలో కలిశామని, అప్పుడే తమ మధ్య ఎంత ప్రేమ ఉందో తెలిసిపోయిందని, తమ మనసులు జీవితాంతం కలిసుండాలని కోరుకుంటున్నాయని అనిపించిందని తెలిపింది. "నీతో కలిసి ఏడడుగులు నడిచి, జీవితాన్ని గడపాలని ఉంది" అని గౌతమ్ ఎంతో భావోద్వేగంతో చెప్పగానే, ఇంతకన్నా మంచివాడు దొరకడన్న భావానికి వచ్చేశానని, ఆపై వివాహ బంధంతో ఇద్దరమూ ఒకటయ్యామని తెలిపింది.

ఇక పెళ్లి తరువాత గౌతమ్ వ్యాపారంలో, తాను షూటింగ్స్ లో బిజీగా ఉన్నా, ఇంటికి రాగానే గౌతమ్ తనను చూసి నవ్వే నవ్వుతోనే పడిపోతానని, అంతకుమించిన పాజిటివ్ వైబ్స్ ఇంకేముంటాయని తన ప్రేమ పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. ఇదే సమయంలో తామిద్దరిపై రెండు కుటుంబాలూ శ్రద్ధ చూపాయని వ్యాఖ్యానించింది.