Tara Gandhi: రైతు నిరసనలకు మద్దతు తెలిపిన మహాత్మా గాంధీ మనవరాలు!

Gandhi Grand Daughter at Delhi Borders
  • సరిహద్దులకు వచ్చిన తారా గాంధీ
  • రైతులు క్షేమంగా ఉండాలి
  • ప్రభుత్వానిదే ఆ బాధ్యతని వ్యాఖ్య
  • తొలి స్వాతంత్ర పోరాటాన్ని గుర్తు చేసిన తారా గాంధీ
మహాత్మా గాంధీ మనవరాలు, 84 ఏళ్ల తారా గాంధీ భట్టాచార్జీ, ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు తెలుపుతున్న రైతులకు సంఘీభావం తెలిపారు. ఘాజీపూర్ సరిహద్దులకు వచ్చిన ఆమె, రైతులను కలుసుకుని మాట్లాడారు. ప్రస్తుతం నేషనల్ గాంధీ మ్యూజియం చైర్ పర్సన్ గా ఉన్న ఆమె, నిరసన తెలియజేస్తున్న రైతులను కలుసుకున్న తరువాత మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం రైతులు క్షేమంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఈ మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు.

తన పర్యటనలో భాగంగా గాంధీ సమారక్ నిధి చైర్మన్ రామచంద్ర రాహి, ఆల్ ఇండియా సర్వ్ సేవా సంఘ్రా మేనేజింగ్ ట్రస్టీ అశోక్ శరాన్, గాంధీ సమారక్ నిధి డైరెక్టర్ సంజయ్ సింఘా తదితరులతో కలసి రైతుల వద్దకు వెళ్లారు. "మేమేమీ ఓ రాజకీయ కార్యక్రమంలో భాగంగా ఇక్కడకు రాలేదు. మేము నేడు రైతుల పక్షాన ఇక్కడకు వచ్చాము. రైతులు తమ జీవితాంతం దేశం కోసం శ్రమిస్తుంటారు. వారి బాగోగులను ప్రభుత్వం పట్టించుకోవాలి" అని అన్నారు.

జాతి యావత్తూ రైతులపైనే ఆధారపడి వుందని, దేశానికి అన్నం పెట్టే వెన్నెముకలు రైతులేనని వ్యాఖ్యానించిన ఆమె, వారి సంక్షేమం కోసం దేశమంతా పోరాడుతుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా 1857లో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన తొలి స్వాతంత్ర పోరాటాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. ఈ పోరాటం ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో మొదలైందని వ్యాఖ్యానించిన ఆమె, ఇప్పుడు కూడా అంతే స్ఫూర్తితో ఉద్యమం జరుగుతోందని అన్నారు.

"ఏం జరిగినా, ఎలా జరిగినా, రైతులు తప్పకుండా లబ్దిని పొందాల్సిందే. వారు పడే శ్రమ గురించి చాలా మందికి తెలియదు. రైతులకు వ్యతిరేకంగా తీసుకునే ఏ నిర్ణయాన్నీ హర్షించలేము" అని తారా గాంధీ భట్టాచార్జీ వ్యాఖ్యానించారు.

Tara Gandhi
Farmers
New Delhi
Borders

More Telugu News