Trains: దేశవ్యాప్తంగా అన్ని రైళ్లను తిప్పేందుకు తేదీ ఇంకా ఖరారు చేయలేదు: రైల్వే మంత్రిత్వ శాఖ

  • కరోనా వ్యాప్తితో నిలిచిన రైళ్లు
  • దశలవారీగా రైళ్లను పట్టాలెక్కిస్తున్న కేంద్రం
  • ఏప్రిల్ నుంచి అన్ని రైళ్లు తిరుగుతాయంటూ వార్తలు
  • స్పష్టత నిచ్చిన కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ
  • ఊహాగానాలు నమ్మవద్దని వెల్లడి
Railway ministry says there is no date fix to run all trains

కరోనా వ్యాప్తి నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించడంతో దేశవ్యాప్తంగా రైళ్లు నిలిచిపోయాయి. ఆ తర్వాత క్రమంగా శ్రామిక్ రైళ్లు, ప్రత్యేక రైళ్లు నడుపుతూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికుల అవసరాలు తీర్చే ప్రయత్నం చేసింది. ఇప్పటికీ పూర్తిస్థాయిలో రైళ్లు తిరగడంలేదు. కొన్ని ఎక్స్ ప్రెస్ రైళ్లకే అనుమతి ఇచ్చారు.

అయితే దేశవ్యాప్తంగా ఆంక్షలు సడలిస్తుండడంతో రైళ్లకు కూడా పచ్చజెండా ఊపుతారన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. సినిమా థియేటర్లలో 100 శాతం ప్రేక్షకులతో ప్రదర్శనలు, వీక్షకులతో క్రీడా పోటీల నిర్వహణ, సభలు, సమావేశాలకు అనుమతి నిచ్చిన నేపథ్యంలో రైళ్లకు సంబంధించి కేంద్రం నిర్ణయం తీసుకుంటుందని, ఏప్రిల్ లో రైళ్లన్నీ పట్టాలెక్కుతాయని వార్తలు వస్తున్నాయి.

దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. తాజాగా ప్రకటన చేసింది. దేశంలో అన్ని రైళ్లను తిప్పేందుకు తేదీని ఇంకా ఖరారు చేయలేదని వెల్లడించింది. మీడియాలో వస్తున్న వార్తలపై తాము క్రమం తప్పకుండా వివరణ ఇస్తూనే ఉన్నామని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

మరోసారి అదే విషయాన్ని పునరుద్ఘాటిస్తున్నామని, అన్ని రైళ్లను తిప్పేందుకు ఇంకా నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం దేశంలో 65 శాతం రైళ్లు నడుస్తున్నాయని, ఈ జనవరిలోనే 250 రైళ్లను పట్టాలెక్కించామని వివరించారు. దశలవారీగా మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. ప్రజలు ఊహాగానాలను నమ్మవద్దని రైల్వే మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో స్పష్టం చేసింది.

More Telugu News