మాజీ ముఖ్యమంత్రి మనవడిని పెళ్లాడబోతున్న హీరోయిన్ మెహ్రీన్

13-02-2021 Sat 18:59
  • భజన్ లాల్ బిష్ణోయ్ మనవడిని పెళ్లాడనున్న మెహ్రీన్
  • ఇటీవలే ఇద్దరికీ పరిచయం
  • పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండనున్న మెహ్రీన్
Actress Mehreen to marry EX CMs grandson

తెలుగులో పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ మెహ్రీన్ పిర్జాదా. 'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన మెహ్రీన్... ప్రస్తుతం 'ఎఫ్-3' చిత్రంలో నటిస్తోంది. వెంకటేశ్, వరుణ్ తేజ్, తమన్నాలతో పాటు ఈ చిత్రంలో మెహ్రీన్ నటిస్తోంది. మరోవైపు ఆమె త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతోంది.

హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ ను ఆమె పెళ్లి చేసుకోబోతోంది. ఈరోజు వారి నిశ్చితార్థం జరగనుంది. పెళ్లి తేదీని త్వరలోనే ప్రకటించబోతున్నారు. కుటుంబసభ్యులు, కొందరు సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం జరగనుంది. కొన్ని రోజుల క్రితమే భవ్యతో మెహ్రీన్ కు పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని మెహ్రీన్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.