Rahul Gandhi: గత కొన్నేళ్లుగా విద్వేషం అనేది క్రికెట్ క్రీడను కూడా వదల్లేదు: రాహుల్ గాంధీ

  • ఉత్తరాఖండ్ క్రికెట్ కోచ్ వసీం జాఫర్ రాజీనామా
  • జట్టు ఎంపికలో ఇతరుల జోక్యం ఎక్కువైందన్న జాఫర్
  • జాఫర్ మతం పేరుతో జట్టును చీల్చాడంటున్న ఉత్తరాఖండ్ క్రికెట్ సంఘం
  • విద్వేషం అనేది సాధారణ అంశంలా మారిందన్న రాహుల్
Rahul Gandhi says hate marred cricket also

టీమిండియా మాజీ ఆటగాడు వసీం జాఫర్ ఇటీవలే ఉత్తరాఖండ్ క్రికెట్ జట్టు కోచ్ పదవికి రాజీనామా చేయడం క్రికెట్ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. జట్టు ఎంపికలో తన ప్రమేయం లేకుండానే మార్పులు, చేర్పులు జరుగుతున్నాయని, ఏకంగా కెప్టెన్ సహా 11 మందిని మార్చేశారని వసీం జాఫర్ ఆరోపించాడు. జట్టు ఎంపికలో ఇతరుల జోక్యం ఎక్కువైందని అన్నాడు. అయితే ఉత్తరాఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం మాత్రం... జాఫర్ జట్టును మతం పేరుతో రెండుగా చీల్చాడని చెబుతోంది. దాంతో వసీం జాఫర్ ప్రతిస్పందిస్తూ... మతమే సమస్య అయితే వాళ్లే తనను తొలగించేవాళ్లని, తానెందుకు రాజీనామా చేస్తానని అన్నాడు.

ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. గత కొన్నేళ్లుగా విద్వేషం అనేది ఓ సాధారణ అంశంలా మారిపోయిందని, చివరికి మనం ఎంతగానో అభిమానించే క్రికెట్ క్రీడను కూడా కమ్మేసిందని విచారం వ్యక్తం చేశారు. భారతదేశం మనందరికి చెందింది, మన ఐక్యతను విచ్ఛిన్నం చేసే అవకాశం విద్వేషవాదులకు ఇవ్వొద్దు అని స్పష్టం చేశారు.

ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుమారుడు జై షా ఆసియా క్రికెట్ మండలి అధ్యక్షుడిగా నియమితుడైన సందర్భంలోనూ రాహుల్ తన గళం వినిపించారు. బీజేపీ తరహాలో ప్రతిభకు పట్టం కట్టారంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. జై షా బీసీసీఐ కార్యదర్శిగానూ వ్యవహరిస్తున్న తెలిసిందే.

More Telugu News