Somireddy Chandra Mohan Reddy: అధికారం చేతిలో ఉంది కదా అని ఇలా చేస్తే కుదరదు: సోమిరెడ్డి

somireddy slams ap govt
  • రాజధానిలో భవనాల నిర్మాణాల‌కు లక్ష కోట్లు అవసరం లేదు
  • 2 వేల కోట్లు చాలని నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా
  • వైసీపీ నియమించిన కమిటీ అదే తేల్చింది
  • ఇప్పటికైనా అమరావతిని రాజధానిగా కొనసాగించాలి  
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వంపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. అమరావతిలో నిర్మాణంలో ఉన్న భవనాలన్నింటినీ పూర్తి చేయాలంటే రూ.2,154 కోట్లు అవసరమని, ఇప్పటికే 70 శాతం నిర్మించినవాటి మీద రూ.300 కోట్లు ఖర్చు చేస్తే అవి పూర్తయిపోతాయని తాజాగా పురపాలక శాఖ అధికారులు అంచనా వేసి, నివేదిక ఇచ్చిన‌ట్లు ఈనాడులో వ‌చ్చిన వార్త‌ను ఆయ‌న పోస్ట్ చేశారు.

'రాజధానిలో భవనాల నిర్మాణం పూర్తి చేయడానికి లక్ష కోట్లు అవసరం లేదని 2 వేల కోట్లు చాలని నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నా..  ప్రజాధనంతో అత్యంత సౌకర్యవంతంగా నిర్మించిన భవనాలను శిథిలాలుగా మార్చకూడ‌ద‌నీ కోరాను. ఈ రోజు మీరు నియమించిన కమిటీ అదే తేల్చింది'  అని సోమిరెడ్డి పేర్కొన్నారు.
 
'రూ.2,112 కోట్లతో మొత్తం భవనాల నిర్మాణాలను పూర్తి చేయవచ్చని సూచించింది. 70 శాతం పూర్తయిన భవనాలకు రూ.300 కోట్లు చాలని నివేదిక ఇచ్చింది. ఈ నివేదికతో అమరావతిని రాజధానిగా కొనసాగించడంపై మీకున్న కక్ష తేటతెల్లమైంది.

 ఒక విలువైన ప్రాంతాన్ని నిర్మించడం కష్టమైనా చరిత్రలో ఆదర్శంగా నిలిచిపోతారు.  విలువైన నిర్మాణాలను నిర్వీర్యం చేస్తే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అధికారం చేతిలో ఉంది కదా అని ప్రజల ఆస్తులను శిథిలం చేస్తామంటే కుదరదు.. ఇప్పటికైనా రాష్ట్రంలో అందరికీ అనువైన ప్రాంతమైన అమరావతిని రాజధానిగా కొనసాగించాలి' అని ఆయ‌న డిమాండ్ చేశారు.
Somireddy Chandra Mohan Reddy
Telugudesam
YSRCP
Andhra Pradesh

More Telugu News