Wrestling: హర్యానాలో రెజ్లింగ్​ అకాడమీలో కాల్పులు.. కోచ్​ సహా ఐదుగురి మృతి

  • శుక్రవారం పొద్దుపోయాక హర్యానాలోని రోహ్ టక్ లో దారుణం
  • మృతుల్లో ఇద్దరు కోచ్ లు, ఇద్దరు మహిళా రెజ్లర్లు
  • వ్యక్తిగత కక్షలే కాల్పులకు కారణమంటున్న పోలీసులు
  • తోటి రెజ్లరే కాల్పులు జరిపాడంటూ మరో వాదన
Women wrestlers coach among five killed in firing at Rohtaks Mehar Singh Akhada

రెజ్లింగ్ అకాడమీలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఏడుగురికి బుల్లెట్ గాయాలు కాగా.. అందులో ఐదుగురు మృత్యువాత పడ్డారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళా రెజ్లర్లు, ఇద్దరు కోచ్ లు ఉన్నారు. కోచ్ దంపతులు చనిపోగా.. వారి మూడేళ్ల కుమారుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన శుక్రవారం పొద్దుపోయిన తర్వాత మెహర్ సింగ్ అకాడమీలో జరిగినట్టు పోలీసులు తెలిపారు.

చనిపోయిన వారిని మండోతి గ్రామానికి చెందిన కోచ్ మనోజ్ కుమార్, అతడి భార్య సాక్షి, మోఖ్రా గ్రామానికి చెందిన మరో కోచ్ ప్రదీప్ ఫౌజీ, పూజా, సతీశ్ గా గుర్తించారు. మనోజ్, సాక్షిల కుమారుడు సర్తాజ్ కు గాయాలైనట్టు పోలీసులు చెప్పారు. వ్యక్తిగత కక్షలే కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మనోజ్ కుమార్ తో గొడవలున్న వ్యక్తులే ఘటనకు పాల్పడి ఉంటారని ప్రాథమిక అంచనాకు వచ్చారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలను ఏర్పాటు చేసినట్టు రోహ్ టక్ ఎస్పీ రాహుల్ శర్మ తెలిపారు.

రెజ్లింగ్ కోచ్ ల మధ్య ఉన్న విభేదాలే ఘటనకు కారణమని మరో వాదన వినిపిస్తోంది. బరోడా గ్రామానికి చెందిన మరో కోచ్ సుఖ్వీందర్ తో మనోజ్ కు పాత గొడవలున్నట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ కక్షను మనసులో పెట్టుకున్న సుఖ్వీందర్.. మనోజ్ నడుపుతున్న అకాడమీకి వచ్చి మనోజ్, సాక్షి, అతడి కుమారుడు సర్తాజ్, మరికొందరిపై కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, తర్వాతే అన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు చెబుతున్నారు.

More Telugu News