YS Jagan: ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు.. జగన్‌పై కేసును వాపస్ తీసుకుంటామన్న కోదాడ పోలీసులు

kodada police want to withdraw case against ap cm jagan
  • అనుమతి లేకుండా జాతీయ రహదారిపై ర్యాలీ
  • ఈ కేసులో ఏ2, ఏ3లపై కేసులను ఎప్పుడో కొట్టేసిన న్యాయస్థానం
  • అభియోగాలు నిరూపణ కాకపోవడంతో కేసు ఉపసంహరణకు పిటిషన్
2014 ఎన్నికల సందర్భంగా జాతీయ రహదారిపై అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించి, ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ అందిన ఫిర్యాదుపై అప్పట్లో కేసు నమోదు చేసిన కోదాడ పోలీసులు ఇప్పుడా కేసును ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టులో నిన్న పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో నాగిరెడ్డి (ఏ2), వైవీ రత్నంబాబు (ఏ3)లపై నమోదైన కేసులను కోర్టు కొట్టివేయగా, ఏ1గా ఉన్న జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటి వరకు విచారణకు హాజరుకాలేదు.

న్యాయస్థానం ఎదుట నిన్న హాజరు కావాలని ఆదేశించినా, సమన్లు ఇవ్వలేదని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న మిగతా ఇద్దరిపైనా నమోదైన అభియోగాలు నిరూపణ కాలేదని, కాబట్టి ఈ కేసు వీగిపోయినట్టేనని కోర్టుకు సమర్పించిన పిటిషన్‌లో పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో జగన్‌పై పెట్టిన కేసును ఉపసంహరించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. స్పందించిన కోర్టు ఈ కేసు పెట్టిన ఎంపీడీవో ఆళ్ల శ్రీనివాస్‌రెడ్డి కోర్టుకు హాజరు కావాలని ఆదేశిస్తూ విచారణను ఈ నెల 17కు వాయిదా వేసింది.
YS Jagan
Kodada Police
court

More Telugu News