డేట్స్ అటు ఇటు సర్దుబాటు చేస్తున్న ప్రభాస్!

12-02-2021 Fri 16:55
  • తొలిషెడ్యూలు షూటింగ్ పూర్తయిన 'సలార్'
  • 'ఆదిపురుష్' సెట్లో అగ్నిప్రమాదం.. ఆగిన షూట్
  • 'సలార్'కు, నాగ్ అశ్విన్ చిత్రానికి డేట్స్ సర్దుబాటు    
Prabhas to adjust dates of Adipurush to other projects

ప్రభాస్ ఇప్పుడు హఠాత్తుగా డేట్లు సర్దుబాటు చేసే పనిలో పడ్డాడు. ఇటీవలే 'రాధే శ్యామ్' చిత్రాన్ని పూర్తిచేసిన ఈ యంగ్ రెబల్ స్టార్.. ఆ వెంటనే మరో రెండు చిత్రాలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. వీటిలో ఒకటి ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సలార్' కాగా.. మరొకటి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న 'ఆదిపురుష్'. నెలలో సగం రోజుల చొప్పున ఈ రెండు చిత్రాలకూ డేట్స్ ఇచ్చాడు. 'సలార్'కు సంబంధించిన తొలి షెడ్యూలు షూటింగు కూడా ఇప్పటికే ముగిసింది.

ఇదే సమయంలో ముంబయ్ లో 'ఆదిపురుష్' కూడా మొదలైంది. అయితే, ఆ చిత్రం సెట్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడంతో ఇప్పుడు షూటింగ్ అప్ సెట్ అయింది. ఈ సినిమా కోసం మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని పరికరాలు ఆ అగ్ని ప్రమాదంలో పాడయ్యాయట. వాటిని మళ్లీ విదేశాల నుంచి తెప్పించాల్సివుంది.

ఆ కారణంగా 'ఆదిపురుష్' షూటింగ్ తాత్కాలికంగా ఆగింది. దీంతో ఈ సినిమాకి కేటాయించిన డేట్లు వృథా కాకుండా.. ఆ డేట్లను 'సలార్'కు, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న చిత్రానికీ ప్రభాస్ కేటాయిస్తున్నాడని తెలుస్తోంది. అలా 'ఆదిపురుష్'కి విఘ్నం కలగడంతో మిగతా రెండు సినిమాలకీ అనుకోకుండా డేట్స్ వచ్చాయన్నమాట!