Sukumar: మామూలుగా "ఏరా బుచ్చి" అనే వాడ్ని... 'ఉప్పెన' సినిమా చూశాక ఆ మాట అనలేకపోయాను: దర్శకుడు సుకుమార్

  • ఇవాళ విడుదలైన ఉప్పెన
  • బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చిత్రం
  • సుకుమార్ వద్ద అసిస్టెంట్ గా పనిచేసిన బుచ్చిబాబు
  • శిష్యుడ్ని ఆకాశానికెత్తేసిన సుక్కు
Director Sukumar appreciates his assistant Buchubabu directorial debut Uppena

మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతూ నటించిన చిత్రం ఉప్పెన. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇవాళ రిలీజైంది. ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు స్టార్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడే. కాగా, ఉప్పెన చిత్రం చూసిన తర్వాత సుకుమార్ తన శిష్యుడ్ని ఆకాశానికెత్తేశారు. ఇది సునామీ లాంటి విజయం అని కొనియాడారు. విడుదలైన ప్రతి సెంటర్ నుంచి హిట్ టాక్ వస్తోందని, వంద కోట్ల సినిమా అనడంలో అతిశయోక్తి ఏమీ లేదని తెలిపారు. గురువుగా తాను గర్వించేలా చేశాడని బుచ్చిబాబు సానాపై సుకుమార్ పొగడ్తల వర్షం కురిపించారు.

"మామూలుగా ఎప్పుడైనా కనిపిస్తే ఏరా బుచ్చి అనేవాడ్ని. ఉప్పెన సినిమా చూసిన తర్వాత ఆ మాట అనలేకపోయాను. సినిమా హాల్లోంచి బయటికి వస్తూ ఏరా అనేందుకు సంకోచించి, బుచ్చి అని పిలిచాను. ఈ సినిమాతో దర్శకుడిగా బుచ్చిబాబుకి ఎనలేని గౌరవం వచ్చేసింది. తను స్క్రిప్టు రాసుకున్న విధానం కానీ, సినిమా తీసిన విధానం కానీ ఓ కొత్త డైరెక్టర్ లా లేదు. అంత బాగా తీశాడు" అని ప్రశంసించారు. తన శిష్యుడి విజయాన్ని ఎంతో ఆస్వాదించిన సుక్కు ఈ సందర్భంగా కార్యాలయం ఎదుట స్వయంగా టపాసులు పేల్చి సంతోషాన్ని వ్యక్తం చేశారు.
లవ్, ఎమోషనల్ డ్రామా జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి కథానాయికగా నటించింది. విజయ్ సేతుపతి కీలకపాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు హైలైట్ అని చెప్పాలి. ఈ సినిమాకు కథ, మాటలు అందించింది సుకుమారే కావడం విశేషం. ఆయన తన వద్ద పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్ లను ప్రోత్సహించేందుకు సుకుమార్ రైటింగ్స్ పేరుతో ప్రొడక్షన్ హౌస్ కూడా ప్రారంభించారు. ఉప్పెన చిత్ర నిర్మాణంలో ఈ సంస్థ కూడా పాలుపంచుకుంది.

More Telugu News