Donald Trump: కరోనాతో బాధపడిన సమయంలో మరణం అంచుల వరకు వెళ్లొచ్చిన ట్రంప్..!

Trumps Covid 19 condition was so concerning that doctors considered putting him on a ventilator source confirms
  • మాజీ అధ్యక్షుడి నాటి ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్ల వివరణ
  • బయటి ఆక్సిజన్ ను అందించాల్సి వచ్చిందని వెల్లడి
  • ఊపిరితిత్తులకు ఇన్ ఫెక్షన్ పాకిందన్న కథనాలు
  • ట్రంప్ కు సీరియస్ గా ఉందని నాడు మీడియాకు వైట్ హౌస్ రహస్య సమాచారం!
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కరోనా వచ్చిన సమయంలో.. అది బాగా ముదిరిపోయిందా? పరిస్థితి చావు దాకా వెళ్లిందా? అంటే అవుననే అంటున్నారు ఆయనకు చికిత్స చేసిన వైద్యులు. పరిస్థితి విషమించడంతో గత ఏడాది అక్టోబర్ లో వాల్టర్ రీడ్ నేషనల్ మిలటరీ మెడికల్ సెంటర్ కు ట్రంప్ ను తరలించారని చెప్పారు. ఊపిరి తీసుకోలేకపోయారని, బయటి నుంచి ఆక్సిజన్ అందించాల్సి వచ్చిందని వివరించారు. ఒకానొక టైంలో ఆయన్ను వెంటిలేటర్ మీద పెట్టాలన్న నిర్ణయానికీ వచ్చినట్టు చెబుతున్నారు.

అంతేగాకుండా ఆయన ఊపిరితిత్తులకూ ఇన్ ఫెక్షన్ పాకిందన్నారు. బ్యాక్టీరియా, కొన్ని రకాల ద్రవాలతో ఊపిరితిత్తులు వాచాయని చెబుతున్నారు. దీని వల్ల ట్రంప్ ఆక్సిజన్ శాచ్యురేషన్ స్థాయులు 80ల్లోకి పడిపోయాయని, ఆయన ఆరోగ్య పరిస్థితి చాలా తీవ్రమైందని అంటున్నారు. అయితే, ట్రంప్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ శాన్ కోన్లీ మాత్రం చికిత్స సమయంలో ఆయన బాగానే ఉన్నారని వెల్లడించారు. ఆయనకు ఆక్సిజన్ పెట్టలేదని, మామూలుగానే ఉన్నారని మీడియాకు చెప్పారు.

దీనిపై తాజాగా బ్రౌన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డీన్ డాక్టర్ ఆశిష్ ఝా స్పందిస్తూ, కోన్లీ తీరుపై మండిపడ్డారు. కోన్లీ నిజాలు చెప్పడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఆ సమయంలో కోన్లీ మోసపూరితంగా వ్యవహరించారని, తప్పించుకునేందుకు చూశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోన్లీ గానీ, శ్వేత సౌధ ప్రతినిధులు గానీ నిజాయతీగా వ్యవహరించి ఉంటే బాగుండేదని అన్నారు.

కాగా, కరోనా సోకిన సమయంలో ట్రంప్ ఆరోగ్య పరిస్థితిపై మీడియాకు వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ మార్క్ మీడోస్ ఎప్పటికప్పుడు వెల్లడిస్తూ ఉండేవారు. కోన్లీతో కలిసి ఓ రోజు ఆయన మీడియాతో రహస్యంగా మాట్లాడినట్టు తెలుస్తోంది. అధ్యక్షుడి ఆరోగ్యం ఏమాత్రం బాగాలేదని, గత 24 గంటల్లో ఆయన చికిత్సకు స్పందించట్లేదని చెప్పినట్టు సమాచారం. 48 గంటలు గడిస్తేగానీ ఏమీ చెప్పలేమని మీడియాకు మీడోస్ వివరించారని ప్రచారం జరిగింది. 
Donald Trump
USA
COVID19
White House

More Telugu News