Odisha: తమ గ్రామాలకు ఏపీ పంచాయతీ ఎన్నికలు జరుపుతోందంటూ ఒడిశా పిటిషన్.. సుప్రీంలో విచారణ!

  • ఏపీ, ఒడిశా మధ్య సరిహద్దు గ్రామాలపై వివాదం
  • తమ గ్రామాలకు ఏపీ పేర్లు మార్చిందన్న ఒడిశా
  • సుప్రీంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు
  • గతంలో ఆ గ్రామాలకు ఎన్నికలు జరిపామన్న ఒడిశా
  • పిటిషన్ కాపీని ఏపీకి ఇవ్వాలన్న సుప్రీంకోర్టు
  • తదుపరి విచారణ శుక్రవారానికి వాయిదా
Supreme Court takes up Odisha petition on border villages

ఏపీ, ఒడిశా సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న పలు గ్రామాలు ఏ రాష్ట్రానికి చెందినవన్న అంశం చాలాకాలంగా వివాదాస్పదంగా వుంది. అయితే, ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ గ్రామాల విషయంలో ఒడిశా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. తమ గ్రామాల్లో ఏపీ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు జరుపుతోందని, ఇది సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమని చెబుతూ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది.

సరిహద్దు ప్రాంతంలోని కోరాపుట్ జిల్లాకు చెందిన మూడు పంచాయతీలను ఏపీ తనవిగా పేర్కొంటోందని, వాటికి పేర్లు మార్చి ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఒడిశా ఆరోపించింది. గంజాయ్ పదవర్ ను గంజాయ్ భద్ర అని, పట్టుసెనరీ ప్రాంతాన్ని పట్టుచెన్నూరుగా, ఫగలుసెనరీ ప్రాంతాన్ని పగులుచినేరుగా మార్చి ఆ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తోందని తెలిపింది.

ఈ మూడు ప్రాంతాల్లో గతంలో తాము పంచాయతీ ఎన్నికలు జరిపామని ఒడిశా తన పిటిషన్ లో వివరించింది. అందుకు ఆధారాలను కూడా సమర్పించింది. కోర్టు ధిక్కరణ కింద చర్యలు తీసుకోవాలని, ఏపీ ఎస్ఈసీ, సీఎస్ ల వివరణ కోరాలని ఒడిశా ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.

ఈ పిటిషన్ పై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ పిటిషన్ ప్రతిని ఏపీ తరఫు న్యాయవాదికి అందించాలని జస్టిస్ ఎంఏ ఖాన్ విల్కర్ ధర్మాసనం తెలిపింది. ఆ పిటిషన్ పై వారంలోగా సమాధానం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే రేపు ఏపీలో జరిగే రెండో విడత ఎన్నికలపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది.

More Telugu News