Atchannaidu: ఓబుళాపురం గనులు వైజాగ్ స్టీల్ ప్లాంటుకు కేటాయించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు: అచ్చెన్నాయుడు

  • విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు కేంద్రం నిర్ణయం
  • కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ఎమ్మెల్యే పల్లా దీక్ష
  • మద్దతు ప్రకటించిన అచ్చెన్నాయుడు
  • ప్రైవేటీకరణను అంగీరించబోమని స్పష్టీకరణ
  • ప్లాంటు భూములు దోచుకునేందుకు కుట్ర అని ఆరోపణ
Atchannaidu comments on Vizag Steel Plant privatisation

వైజాగ్ స్టీల్ ప్లాంటును ప్రైవేటుపరం చేయాలని కేంద్రం నిర్ణయించడం పట్ల ఏపీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విశాఖలో మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దీక్ష చేపట్టారు. దీక్షకు ఇవాళ మూడో రోజు కాగా, ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మద్దతు పలికారు.

దీక్షా శిబిరానికి విచ్చేసిన అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఓబుళాపురం గనులు విశాఖ ఉక్కు కర్మాగారానికి కేటాయించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని అభిప్రాయపడ్డారు. 32 మంది ప్రాణత్యాగాల అనంతరం ఏర్పాటైన స్టీల్ ప్లాంట్ అని, ప్రైవేటీకరణను అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ప్లాంటు పరిధిలో లక్ష కోట్ల విలువైన భూములు ఉన్నాయని, వాటిని దోచుకునేందుకే ప్రైవేటీకరణ చేపడుతున్నారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు వెనుక ఇక్కడి భూములను దోచుకునే కుట్ర దాగివుందని అన్నారు. విశాఖ ప్రాంతాన్ని నాశనం చేసేందుకు కంకణం కట్టుకున్నారని మండిపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా, ఉన్న పరిశ్రమలు సైతం వెళ్లిపోయాయని విమర్శించారు.

కాగా, టీడీపీ నేత పల్లా శ్రీనివాసరావు చేపట్టిన దీక్షకు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా మద్దతు పలికారు.

More Telugu News