Acharya: చిరంజీవి 'ఆచార్య' చిత్రం షూటింగ్ ఇల్లెందు జేకే మైన్స్ లో నిర్వహిస్తుండడం సంతోషదాయకం: మంత్రి పువ్వాడ

Megastar Acharya movie shooting will be held in Illendu JK Mines
  • శరవేగంగా తెరకెక్కుతున్న 'ఆచార్య' చిత్రం
  • త్వరలో ఖమ్మం జిల్లాలో షూటింగ్
  • గనుల్లో చిరంజీవి, రామ్ చరణ్ పై చిత్రీకరణ
  • అనుమతుల కోసం మంత్రి పువ్వాడను కలిసిన కొరటాల శివ 
  • చిరంజీవికి ఆతిథ్యం కూడా ఇస్తామని వెల్లడి
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ఖమ్మం జిల్లా ఇల్లెందులో జరగనుంది. ఇవాళ దర్శకుడు కొరటాల శివ ఇల్లెందులో పర్యటించారు. ఇక్కడి జేకే మైన్స్ లో షూటింగ్ జరిపేందుకు నిర్ణయించారు. అనుమతుల కోసం మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ను 'ఆచార్య' చిత్రబృందం కలిసింది. దీనిపై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు.

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' చిత్రం షూటింగ్ ఇల్లెందులోని జేకే మైన్స్ లో నిర్వహించనుండడం సంతోషకరం అని పేర్కొన్నారు. చిత్రదర్శకుడు కొరటాల శివ కోరిక మేరకు చిత్రీకరణకు అన్ని అనుమతులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. షూటింగ్ కు అనుమతులే కాదు, హీరో చిరంజీవికి తన నివాసంలో ఆతిథ్యం కూడా ఏర్పాటు చేస్తామని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

కాగా, ఇల్లెందులోని జేకే మైన్స్ లో ఓపెన్ కాస్ట్, భూగర్భ గనుల్లో చిరంజీవి, రామ్ చరణ్ లపై పలు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మంత్రి పువ్వాడతో భేటీ అనంతరం దర్శకుడు కొరటాల శివ స్పందిస్తూ, మునుపటితో పోల్చితే ఖమ్మం జిల్లా రూపురేఖలు పూర్తిగా మారిపోయాయని, అందుకు మంత్రి పువ్వాడను అభినందిస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా సినిమా షూటింగ్ లకు ఎంతో అనుకూలంగా ఉందని తెలిపారు.

కాగా, 'ఆచార్య' షూటింగ్  మార్చి 7 నుంచి 15వ తేదీ వరకు ఇల్లెందులో జరగనుంది. అటు కమర్షియల్ విలువలు, ఇటు సందేశంతో కూడిన 'ఆచార్య' చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం మే 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Acharya
Shooting
JK Mines
Illendu
Chiranjeevi
Puvvada Ajay Kumar
Koratala Siva
Khammam District
Telangana
Tollywood

More Telugu News